విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గర గోడకూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన సంఘటన అందరినీ కలచివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మృతుల కుటుంబాలకు, బాధితులకు కేంద్ర ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించారు.
సింహాచలం దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి… సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
సింహాచలం దుర్ఘటనతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. చందనోత్సవం సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సింహాద్రి దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవ వేళ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్నం ఆయన బాధితులను పరామర్శించారు.
సింహాచలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. బనరేంద్ర మోదీ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున సహాయం అందజేస్తామన్నారు.
సింహాచలం ఘటనపై రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, తదితర మంత్రులు సంతాపం వ్యక్తం చేసారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంతాపం ప్రకటించారు.
తెలంగాణకు చెందిన నాయకులు కూడా ఈ దుర్ఘటనపై స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు, తదితరులు సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.