విశాఖపట్నం జిల్లా సింహాచల క్షేత్రంలో ఇవాళ చందనోత్సవం జరుగుతున్న సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల మీద గోడ కూలింది. ఆ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటాక సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి పైకివెళ్ళే దారిలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టికెట్ల క్యూలైన్ మీద సిమెంట్ గోడ కూలిపోయింది. దాంతో ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది, ఇతర అధికారులూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులు పిళ్ళా ఉమా మహేశ్వర రావు, శైలజ ఉన్నారు. మిగతా ఇద్దరూ శైలజ తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మిగా గుర్తించారు. విశాఖపట్నం జిల్లా అడవివరానికి చెందిన ఎడ్ల వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా మాచవరానికి చెందిన పత్తి దుర్గాస్వామి నాయుడు, కుమ్మపట్ల మణికంఠ కూడా మృతుల్లో ఉన్నారు.
హోంమంత్రి అనిత, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.