విశాఖ సమీపంలోని సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘోర దుర్ఘటనలో 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. వారం రోజుల కిందట నిర్మించిన గోడ కూలి భక్తులపై పడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. నాసిరకం నిర్మాణం వల్లే గోడ కూలిపోయిందనే విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానకులు తెలిపిన వివరాల ప్రకారం…
సింహాచలం మల్లన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వేలాది భక్తులు ఒకే ముందుకు వచ్చారు. దీంతో గోడ కూలి ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి తరవాత విశాఖ సమీపంలో సింహాచలం దేవస్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింహగిరి బస్టాండు సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూలైను గోడ కూలి ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. విషయం తెలియగానే హోం మంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన వారిలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తోన్న ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు దర్శనానికి వెళ్లి రూ.300 టికెట్ క్యూ లైనుపై గోడ పడిన ఘటనలో చనిపోయినట్లు సమాచారం అందుతోంది.