కెనడా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. నాలుగోసారి వరుసగా అధికారంలోకి లిబరల్ పార్టీ రాబోతోంది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టే అవకాశముందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. లిబరల్ పార్టీ 145 స్థానాలు ఇప్పటికే గెలుపొందగా, మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.కన్జర్వేటివ్ పార్టీ 134 స్థానాలు దక్కించుకుంది. 13 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలో బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 22 స్థానాల్లో గెలిచింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఖలిస్థానీ అకుకూల జగ్మీత్ సింగ్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ కేవలం నాలుగు స్థానాలు గెలిచుకుంది. 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ప్రతికూల ఫలితాలు రావడంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
కెనడా పార్లమెంటులో 343 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యులు అవసరం. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాలతో కలిపి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించాడు.
అమెరికాతో సుంకాల యుద్ధం, యూఎస్‌లో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ వ్యాఖ్యలపై అంత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా కెనడా దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరిలో ప్రధానిగా ట్రూడో రాజీనామా చేయడంతో, లిబరల్ పార్టీ సభ్యుడు మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని పదవి చేపట్టిన కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించారు. వెంటనే కౌంటింగ్ మొదలైంది. ఫలితాలు వెలువడుతున్నాయి.