దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ అంశం నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విలేకరులు, ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పెగాసస్ స్పైవేర్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత కోసం పెగాసస్ స్పైవేర్‌ను ఓ దేశం కలిగి ఉండటం తప్పు లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఎవరిపై ఎలా ఉపయోగించారనేది చూడాలని కోర్టు అభిప్రాయపడింది.
పెగాసస్ స్పైవేర్ ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటూ న్యాయవాది వాదనలు వినిపించారు.పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సాంకేతిక నిపుణుల నివేదిక కోసం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఆ నివేదిక అందలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని నాయవాది వాదనలు వినిపించారు.
దేశ వ్యతిరేక శక్తులపై పెగాసస్ ఉపయోగిస్తే తప్పులేదు, పౌరసమాజంపై ఉపయోగించారా? లేదా? అనేది చూడాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సామాన్య పౌరులపై పెగాసస్ ఉపయోగిస్తే దర్యాప్తు జరిపిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
సామాన్యుల గోప్యతకు రక్షణ కల్పిస్తామని సర్వోన్నత న్యాయస్థానం భరోసా ఇచ్చింది.
దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సాంకేతిక నివేదక బహిర్గతం చేయడం కుదరదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారికి మాత్రమే సమాచారం అందిస్తామన్నారు.