ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, దేశానికి మతసామరస్యం అవసరమనీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ ఇవాళ మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన జనసేనపార్టీ క్రియాశీల కార్యకర్త మేడిశెట్టి మధుసూదన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయన్నారు. ఉగ్రవాదులు షికారుకు వచ్చినట్లు వచ్చి 26మందిని వేటాడి క్రూరంగా చంపేసి వెళ్లిపోయారని, మధుసూదన్ తలలో 40 బులెట్లు దింపారనీ ఆవేదన వ్యక్తం చేసారు.
ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను కాల్చివేశారని, హిందువుగా పుట్టడం వారి పాపమా అని ప్రశ్నించారు. దేశానికి సహనం ఎక్కువైందని, అతిసహనం కూడా మంచిది కాదన్నారు. మన ఆలోచనా విధానం జాతీయవాదం అని, దేశంలో యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చునన్నారు. దేశంలోని కొందరు సెక్యులర్ వాదులు… ఉగ్రవాదులు మతం అడిగి చంపలేదని చెబుతున్నారని, ఉగ్రదాడిపై వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలని, అంతేగానీ సన్నాయి నొక్కులు నొక్క వద్దని హితవుపలికారు. భారతదేశంలో కూర్చుని పాకిస్థాన్ ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్ పై అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు అక్కడికే వెళ్లిపోవచ్చునన్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్ అయితే ఇండియా హిందూ దేశమన్నారు. ఇండియాలో ఎంతోమంది ముస్లిం నాయకులు, ముస్లింలు ఉన్నారని, ఏ రోజు వారిపై వివక్ష చూపించలేదన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే తామే గొంతుక అవుతామన్నారు. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన చంపడాన్ని సహించబోమన్నారు. ఇప్పుడున్నది పాత భారతదేశం కాదని, సరికొత్త భారతదేశం అన్నారు. మీ ఇష్టానికి వచ్చి కాల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రదాడిలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ లు కొణిదెల నాగబాబు, పిడుగు హరి ప్రసాద్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.