పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడి ప్రతీ భారతీయుడినీ తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని, దానికి ఐకమత్యంగా స్పందించాల్సిన అవసరం ఉందనీ రాహుల్ గాంధీ తన లేఖలో రాసారు. ఈ సంక్లిష్ట సమయంలో మనందరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసికట్టుగా ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పాలని రాహుల్ తన లేఖలో రాసారు. ప్రజా ప్రతినిధులు అందరూ తమ ఐకమత్యాన్ని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ నిబద్ధతనూ చూపించడానికి పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం భావిస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా అలాంటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ముస్లిం ఉగ్రవాదులు 26మంది హిందువులను కాల్చి చంపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.