అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ తిథి నాడు ఉదయం 6.30కు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రారంభించారు. 8 గంటలకల్లా ఆ కార్యక్రమం పూర్తయింది. పూర్ణ కలశంతో కలిపి 161 అడుగుల ఎత్తు ఉన్న ఆలయం మీద 42 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసారు. దానికి సంబంధించిన చిత్రాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసారు.
ఆలయ గోపురాల నిర్మాణం, దానిపై ధ్వజస్తంభం ఏర్పాటుతో మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చంపత్ రాయ్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలాఖరుకు ఏడు మండపాల నిర్మాణం పూర్తవుతుంది. రామదర్బారు మూర్తులు మే నెలలో ప్రతిష్ఠిస్తారు. శివాలయం, సూర్యమందిరం నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నిర్మాణం 2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని చంపత్ రాయ్ వివరించారు.