జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత ఉగ్రవాదుల ఇళ్లు కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రగిలిపోతోన్న ఉగ్రమూకలు పర్యాటకులపై మరోసారి ఉగ్రదాడి జరగవచ్చనే సమాచారం తమకు అందిందని జాతీయ దర్యాప్తు సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా 48 పర్యాటక కేంద్రాలను మూసివేశారు. ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను ముందు జాగ్రత్తగా మూసివేసినట్లు సైన్యం ప్రకటించింది. దాల్ లేక్, గుల్మార్గా ప్రాంతాల్లోనూ పర్యాటకులను అనుమతించడం లేదు.
జమ్ము కాశ్మీర్లో 60 మందికిపైగా ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఉగ్రదాడి తరవాత సైన్యం ఉగ్రమూకల ఇళ్లు కూల్చివేయడంతో స్లీపర్ సెల్స్ బయటకు వస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పర్యాటక ప్రాంతాలపై మరోసారి దాడి జరిగే అవకాశముందనే ముందస్తు సమాచారంలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. బైసరన్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేశారు.