అనుమతులు లేని లే అవుట్లలో స్థలాలు కొన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. స్థలం కొనుగోలు చేసినా ఇంటి నిర్మాణాలకు అనుమతులు లభించక వేలాది మంది అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది. వీరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది.పదిహేనేళ్లకు ముందుగా వేసిన లే అవుట్ల అనుమతులు పునరుద్దరించారు. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు రావడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా సాధ్యంకాలేదు. ఇలాంటి 870 లే అవుట్లలోని 85 వేల మందికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత లే అవుట్ల అనుమతులు పునరుద్దరించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ పరిధిలోనే 624 లే అవుట్లు ఉన్నాయి. వీఎంఆర్డీఏ పరిధిలో మరో 182 వరకు ఉన్నాయని అధికారులు గుర్తించారు. తిరుపతి, పుట్టపర్తి, కర్నూలు, శ్రీకాకుళం ప్రాంతాల్లోనూ మరికొన్ని ఉన్నాయి.
లే అవుట్ల డెవలప్మెంటుకు అనుమతులు తీసుకున్నా, పనులు మూడేళ్లలో పూర్తి చేయాలనే నిబంధన ఉంది. డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు మాత్రమే తనఖా పెట్టిన స్థలాలను పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేస్తుంది. 8509 ఎకరాల్లో 870 లే అవుట్లలో అనుమతులు తీసుకున్నా… పనులు పూర్తి చేయకపోవడంతో కొనుగోలు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూడేళ్ల తరవాత అపరాధ రుసుములు చెల్లించి పునరుద్దరించుకునే సదుపాయం ఉన్నా లే అవుట్లు వేసిన వారు అప్పటికే స్థలాలు అమ్మేసుకుని వెళ్లిపోయారు.తరవాత ఫీజులు భారీగా పెరగడంతోపాటు మరలా అభివృద్ధి ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అనుమతులు పునరుద్దరణకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో లే అవుట్లు వేసిన వ్యాపారులు ముందుకు రావడం లేదు.
అనుమతులు పునరుద్దరణ చేసుకోని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు మంజూరు చేయడం లేదు. ఇలాంటి దరఖాస్తులు పక్కన పడేస్తున్నారు. 870 లే అవుట్ల అనుమతులు పునరుద్దరణ చేసుకోని కారణంగా 85 వేల మంది ఇంటి నిర్మాణం చేసుకోలేకపోతున్నారు. 12 సంవత్సరాల్లోనే 10 వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎల్పీ నెంబరు లేకపోవడం వల్ల బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు.
లక్షలు ఖర్చు చేసి స్థలాలు కొనుగోలు చేసిన వారికి వన్ టైం సెటిల్మెంటు కింద అనుమతులు పునరుద్దరించేందుకు అవకాశం కల్పించింది. అభివృద్ధి ఫీజులు రద్దు చేసింది. లే అవుట్లు వేసిన యాజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకుని లే అవుట్ల అనుమతులు పునరుద్ధరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
రాష్ల్రంలో అనుమతులు లేకుండా వేలాది లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఎల్పీ నెంబరుకు దరఖాస్తు చేశామని, మరో ఆరు నెలల్లో వస్తుందంటూ స్థలాలు అమ్మేసి యజమానులు మాయం అవుతున్నారు. ఇలాంటి అనుమతులు లేని లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఇంటి నిర్మాణానికి అనుమతులు, బ్యాంకు రుణాలు పుట్టడం లేదు. దీంతో వారు లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసినా ఇంటి నిర్మాణానికి నోచుకోవడం లేదు. పూర్తి అనుమతులు వచ్చిన తరవాతే స్థలాల అమ్మకాలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు