జమ్ము కశ్మీర్ పహల్గాం దాడి తరవాత మొదటిసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్దమని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామంటూ తాజాగా వ్యాఖ్యానించారు.ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, లష్కరే ఉగ్ర అధినేత రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
ఖైబర్ షఖ్తుంఖ్వాలోని జరిగిన పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్ మరోసారి నిందలు ఎదుర్కొంటోంది అంటూ ముసలి కన్నీరు కార్చారు. తటస్థ, పారదర్శ, విశ్వసనీయ దర్యాప్తునకు తాము సిద్దమని ప్రకటించారు. శాంతికే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామంటూ పాక్ ప్రధాని శాంతి వచనాలు వల్లించారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తా, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొడతాం అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్రధాని పరోక్షంగా స్పందించారు. మాదేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోమని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. భారత్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదంటూ సింధు నదీ జలాల ఒప్పందం రద్దుపై వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నామన్నారు.