జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. అధికారికంగా పాక్ అధికారికి లేఖ అందించారు. దీనిపై పాక్ నేతలు పేట్రేగిపోతున్నారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో నీరు పారకపోతే…రక్తం పారుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది నాగరికత నిజమైన పరిరక్షకులం తామే, సింధూ నది మాదే అంటూ భుట్టో చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
పాక్ ఉప ప్రధాని సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి నిందితులను స్వతంత్ర్య సమరయోధులతో పోల్చారు. పాక్ రక్షణ మంత్రి ఇలాంటి ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క నీరు తమదేనన్నారు. లష్కరే తొయ్యబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ వేదికగా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో సంచలనంగా మారింది. జమ్ము కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీరు ఆపేస్తామని అంటున్నారు.పాక్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు. చైనా పాక్ నడవా ప్రణాళికను విఫలం చేయాలనుకుంటున్నారంటూ హఫీజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో నీరు ఆపితే…అందులో రక్తం ప్రవహిస్తుందని హఫీజ్ బెదిరింపులకు దిగారు.
1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీజలాల పంపిణీ ఒప్పందం జరిగింది. పాక్‌తో రెండు సార్లు యుద్ధం వచ్చినా, కార్గిల్ వార్ సమయంలోనూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని గౌరవించింది. పాక్ ఉగ్ర చర్యలు మానకపోవడంతో తాజా దాడితో భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. సింధు నదిపై భారీ ప్రాజెక్టు నిర్మించి నీటిని రాజస్థాన్, పంజాబ్, హర్యానా మళ్లించాలని కేంద్రం యోచిస్తోంది.