భారత్లో పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా కన్నా ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. గడిచిన ఆరేళ్లలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి దిగివచ్చిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలియజేస్తోంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పేదరికం అలాగే ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో పేదరికం తగ్గలేదని నివేదికలో పేర్కొంది.
ఉపాధి రంగంలో డైనమిక్స్ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఉపాధి రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. 2018 తరవాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పురుషుల వలస పెద్ద ఎత్తున పెరిగిందని నివేదిక తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వేతనాల విషయంలో లింగవివక్ష కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.దేశంలో నిరుద్యోగ యువత 13.3 శాతం ఉందన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలో 29 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక ద్వారా తెలుస్తోంది.