మద్యం కుంభకోణంలో ఆరో నిందితుడు, ఎస్పీవై ఆగ్రోస్ ఎండీ సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఏ వన్‌గా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండు దఫాలు విచారించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత మద్యం అమ్మకాల ద్వారా ప్రతి నెలా రూ.60 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సిట్ విచారణలో తేలింది. మద్యం పాలసీ రూపొందించేందుకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బాలాజీ, చాణక్య పలు దఫాలు సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో సిట్ అరెస్టులు కొనసాగిస్తోంది. మరికొంత మందిని కూడా అరెస్ట్ చేయనున్నారు.
మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారంనాడు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన్ను విజయవాడకు తరలించారు. కాసేపట్లో కోర్టులో హాజరు పరచనున్నారు.