భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కస్తూరి రంగన్ 1990 నుంచి నాలుగేళ్ల పాటు యూఆర్ఏసీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. తరవాత మూడేళ్లపాటు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కాలంలో ఇస్రో లూనార్ మిషన్‌కు అంకురార్పణ చేశారు.
జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక రాష్ట్ర నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కస్తూరి రంగన్ పనిచేశారు. 2003 నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా చేశారు.ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ సలహాలు అందించారు. 2004 నుంచి ఐదేళ్లపాటు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలందించారు. కస్తూరి రంగన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.