ఉగ్రవాదులపై భారత బలగాలు విరుచుకుపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి తరవాత జమ్ము కశ్మీర్‌ను సైనికల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా లష్కర్ ఏ తొయ్యబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్న దళాలకు అల్తాఫ్ లల్లీ తారస పడ్డారు. బందీపొరాలో అల్తాఫ్‌ను బలగాలు కాల్చి చంపాయి. బందీపారాలో జమ్ము కశ్మీర్ పోలీసులు, బలగాల జాయింట్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులను గుర్తించారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సైనికుల బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. కొందరు సైనికులకు కూడా తూటా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్ పర్యటనలో ఉండగానే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
బైసరన్ దాడిలో అల్తాఫ్ ప్రమేయం నేరుగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. దాడిలో విదేశీయులు ఎక్కువగా ఉండగా, కొందరు మాత్రమే స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సమాచారం చేరవేయడం, వారు తలదాచుకునేందుకు షెల్టర్ ఏర్పాటు, వారి అవసరాలు తీర్చడం వంటివి స్థానికులు చూసుకునేవారు.
పహల్గాంలో దాడులకు దిగిన ఉగ్రవాదులు గతంలోనూ పలు దాడులకు దిగినట్లు తేలింది. సోనమార్గ్, బూటపత్రి, గందర్బాల్ దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరులో బూటపత్రిలో ఇద్దరు ఆర్మీ సిబ్బందిని కాల్చి చంపారు. సోనమార్గ్ సొరంగంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలకు పాల్పడిన అహ్మద్ భట్‌ను డిసెంబరులో సైన్యం కాల్చి చంపింది. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. అప్పటి నుంచి అడవుల్లో నక్కినట్లు తెలుస్తోంది.
ఉగ్ర ముఠా హఫీజ్ సయీద్, సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుకునేవారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నుంచి సందేశాలు అందేవి. ఉగ్రమూకలు మూడు ప్రదేశాల్లో ఎక్కువ మందిని చంపాయి. ముందుగా ఐదుగురిని చంపగా, తరవాత మైదాన ప్రాంతంలో ఇద్దరిని చంపేశారు.
పారిపోయేందుకు ప్రయత్నించిన పర్యాటకుల్లో ఎక్కువ మందిని కంచె వద్ద కాల్చి చంపారు.