జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరిపోవాలని ఆదేశించారు. ఉగ్రదాడి తరవాత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ బైసరన్ లోయలో పర్యటించనున్నారు. ఉదంపూర్లోనూ ఆయన పర్యటించే అవకాశాలున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలగాలను మోహరిస్తున్నారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం భారీగా కాల్పులకు దిగడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాక్ దళాల కాల్పులను తిప్పికొడుతున్నారు.
ఓ వైపు ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తూ సరిహద్దుల వెంట బలగాలను మోహరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా కీలక అధికారులతో చర్చలు జరపనున్నారు. ఉగ్రదాడి తరవాత ఇప్పటికే భారత్ ముప్పేట దాడి ప్రారంభించింది. దౌత్యపరంగా పాక్పై ఒత్తిడి పెంచడంతోపాటు సింధు నదీ జాలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వాఘా, అటారీ సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయాన్ని వారంలో ఖాళీ చేయాలని ఆదేశించారు. పాకిస్తాన్ పౌరులు దేశం వీడి వెళ్లాలని ఆదేశించారు. పాకిస్థాన్ పౌరులకు వీసా ప్రాసెస్ నిలిపివేశారు.