జమ్ము కాశ్మీర్ పహల్గాం సమీపంలోని పర్యాటక ప్రాంతం బైసరన్ ఉగ్రదాడి ఘటనకు ప్రభుత్వ వైఫల్యం కూడా తోడైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. భారత స్విట్జర్లాండుగా పేరొందిన పర్యాటక ప్రాంతం బైసరన్ లోయను పర్యాటకుల కోసం తెరచిన విషయం తమకు తెలియదని అఖిల పక్ష సమావేశంలో కేంద్రం వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలోని పర్యాటకులకు తెలిసిన విషయం కేంద్రానికి, సైనిక విభాగాలకు తెలియదా అంటూ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ముందు నుంచి బైసన్ లోయను మూసి వేస్తూ ఉంటారని, స్థానిక అధికారులు లోయను తెరచి ఉంచినట్లు తమకు తెలిదన్నట్లుగా అఖిల పక్షంలో కేంద్రం చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ట్రెక్కింగ్ చేసే పర్యాటకులు, విదేశీ పర్యాటకులు 45 నిమిషాలు పహల్గాం నుంచి నడక ద్వారా, కొందరు గుర్రాలపై చేరుకుంటారు. అక్కడి పచ్చని పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలు, మంచు కొండలు, చల్లని వాతావరణం మినీ స్విట్జర్లాండును తలపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ సైన్యం ఎందుకు లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
సైనికుల దుస్తులు ధరించిన ముగ్గురు ముష్కరులు కాల్పులకు తెగబడిన రెండు గంటల తరవాత కూడా సైనికులు అక్కడికి చేరుకోలేకపోయాని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం, నిఘా వర్గాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ అఖిలపక్షంలో పలు పార్టీల నేతలు నిలదీసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.