జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారంటూ పాక్ ఉపప్రధాని ఇషాక్ ధార్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చుతూ పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉగ్రదాడి తరవాత భారత్ సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దాన్ని మేము అంగీకరించడం లేదు. మా హక్కుల కోసం పోరాటం చేస్తామంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ ధార్ వ్యాఖ్యానించారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కేంద్ర జలసంఘం కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, పాక్ అధికారి సయీద్ అలీకి లేఖ అందజేశారు. అంతర్జాతీయ ఒప్పందాలు గౌరవంతో, నిజాయితీగా అమలు చేయాలని, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మా హక్కులను హరించి వేస్తోందంటూ ముఖర్జీ రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకే సింధూ నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.