జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంట పాకిస్థాన్ సైన్యం గత అర్థరాత్రి నుంచి భారత సైన్యంపై కాల్పులు జరుపుతోంది. భారత సైనికులు తిప్పికొడుతున్నారు. ఎవరికీ గాయాలు కాలేదని సైన్యం ప్రకటించింది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ పహల్గాం, శ్రీనగర్లో పర్యటించనున్నారు. ఆర్మీ కమాండర్లతో సమావేశం కానున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తరవాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన సింధు నదీ జలాల ఒప్పందం రద్దైంది. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. వారంలో ఖాళీ చేసి వెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు.
పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేసింది. పాకిస్థాన్లో వాణిజ్యం నిలిపివేసింది. అటారీ సరిహద్దులను మూసివేశారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా సమాధానం చెబుతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో ఉగ్రరాజ్యం రావల్పిండిలో యుద్ధ విమానాలను మోహరించింది. ఉగ్రదాడి తరవాత ఉపఖండంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మరోవైపు జమ్ముకశ్మీర్ బందీపొరాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కూంబింగ్ చేస్తోన్న బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు దిగడంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రమూకలు నక్కి ఉన్నారని తెలుస్తోంది.