తెలంగాణలోని వరంగల్లో ఇవాళ 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో వారు లొంగిపోయారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.25 వేల ఆర్థిక సాయం అందించింది. రెండు నెలల నుంచి మావోయిస్టుల లొంగుబాటు ప్రోత్సహిస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 250 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. తాజాగా 14 మంది లొంగిపోయారని చెప్పారు.
మావోయిస్టులు హింసాయుత విధానాలు విడిచిపెట్టేలా చేయడమే తమ లక్ష్యమని ఐజీ తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా సహకరిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందించడంతోపాటు, ప్రభుత్వ ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ చంద్రశేఖర్రెడ్డి చెప్పారు.