పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకం దేశ ప్రజలను కదిలించివేసింది. పర్యాటకులను మతం అడిగి, వారిలో హిందువులను వేరు చేసి వారిని కాల్చి చంపేసారన్న నిజం బైట పడడంతో ఉగ్రవాదుల లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. పురుషులను కల్మా చదవమనడం, ప్యాంట్లు ఊడబెరికి సున్తీ జరిగిందా లేదా చూడడం ద్వారా వారు ముస్లిములు అవునా కాదా అని నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే వారిని కాల్చి పారేసారు. మృతుల బంధువులైన ఆడవారితో ‘‘వెళ్ళి మోదీకి చెప్పుకోండి పొండి’’ అని చెప్పారు. దాన్ని బట్టే వారి లక్ష్యం ఏమిటన్నది సుస్పష్టంగా తెలిసిపోయింది.
ముస్లిములు కాని హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపాలి. తమ ప్రథమ శత్రువు నరేంద్ర మోదీ పాలనను వైఫల్యంగా చూపించాలి. కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయాలంటే అక్కడ శాంతి భద్రతలు ఉండకూడదు. కశ్మీరీ ప్రజలకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు వారు మళ్ళీ ఉగ్రవాదంలో కలుస్తారు. పర్యాటకం ద్వారా వచ్చే ప్రధాన ఆదాయాన్ని దెబ్బ తీస్తే కశ్మీరీలలో అత్యధికులకు జీవనోపాధి పోతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ రాళ్ళు రువ్వే ఉద్యోగాలు చేపడతారు… ఇవీ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు.
దీనికి అనుబంధంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టినీ ఆకర్షించాలంటే, విదేశీ పర్యాటకులను బెదరగొట్టాలంటే, కశ్మీర్లో అడుగు పెట్టకుండా చేయాలంటే కొంతమంది విదేశీయులను కూడా చంపేయాల్సిందే. అదే వ్యూహాన్ని అనుసరించారు. ఇద్దరు విదేశీ పర్యాటకులను తుదముట్టించారు. పర్యాటక ప్రదేశంలో దాడి జరుగుతుంటే ఒక ముస్లిం గైడ్/ఆపరేటర్ అడ్డుకున్నారు. దాంతో అతన్ని చంపేసారు. అంతే తప్ప, వారిని చంపడం వెనుక ఉగ్రవాదులకు వేరే ఉద్దేశాలు లేవు. వారి ప్రధాన అజెండా హిందువులను హతమార్చడం. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కక్ష సాధించడం. ఆ విషయం వాళ్ళు చాలా స్పష్టంగా, బహిరంగంగా, ఎలాంటి శషభిషలూ లేకుండా ప్రకటించేసారు.
ఉగ్రవాదులకు మతం ఉంది. ఆ విషయాన్ని ఉగ్రవాదులు విస్పష్టంగా చెప్పారు. ముస్లిములు అవునా కాదా అని తేల్చుకుని మరీ చంపారు. కానీ, వారికి ఉన్న ఆ స్పష్టత సామాన్య భారతీయ ప్రజలకు అర్ధమైపోతే లౌకికవాదులైన ముస్లిం అతివాదులు, కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు, దళిత ముసుగులోని క్రైస్తవులు, ఉదారవాదులు వంటి వివిధ ముసుగుల్లో ఉన్న దేశ వ్యతిరేక ప్రతీప శక్తులకు ఎంత బాధ. ఉగ్రవాదులు కూడా మంచివారే అనీ, వాళ్ళు హిందువుల మేలు కోసమే హిందువులను చంపారనీ, ముస్లిం ఉగ్రవాదులు నోట్లో వేలు పెడితే కొరకలేని వారనీ, వాళ్ళ తుపాకులకు మతం అనేది లేదనీ ప్రచారం చేయాలి. ఇంకా చెప్పాలంటే హిందువులే తమను తాము చంపేసుకుని ఆ నేరాన్ని ఉగ్రవాదుల మీదకు నెట్టేసారని ప్రచారం చేయాలి. సరిగ్గా అదే పని చేసారు.
కొత్తగా పెళ్ళయి నాలుగు రోజులు కూడా గడవని జంట హనీమూన్ కోసం పహల్గామ్ వెడితే, ఆ జంటలో భార్యను పక్కన పెట్టి భర్తను ఆమె కళ్ళముందే కాల్చి చంపేసారు. దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి కన్నీళ్ళు యావత్ దేశాన్నీ కరిగించి వేసాయి. కుటుంబంతో కశ్మీర్‌ను సందర్శించడానికి వెళ్ళిన విశాఖపట్నం మహిళ తన చేతిని పట్టుకుని ఉండగా ఆమె భర్తను హిందువువా అని అడిగి కాల్చి చంపేస్తే ఆయన రక్తం ఆమె ముఖం మీద చిమ్మింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కన్నీటి గాధ. ఆ ఆవేదన అంతులేనిది. ఆ ఆక్రోశం ఎన్నటికీ తీరనిది. ఆ కుటుంబాలకు ఆ లోటు ఎన్నటికీ పూడనిది.
కానీ సోకాల్డ్ సెక్యులర్ వాదులు ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేసారంటే హిందూ మహిళలే తమ భర్తలను చంపించేసారని కూడా ప్రేలాపనలు ప్రేలారు. అసలు అక్కడ జరిగినది హిందువులపై దాడి కాదని చెప్పడానికి నానా పాట్లూ పడ్డారు. దానికోసం ఏకంగా ఒక మహిళతో మాట్లాడించారు.
‘‘వాళ్ళు (ఉగ్రవాదులు) మొదట మీరు హిందువులా అని అడిగి, హిందువులు అయిన వారిని చంపారు. ముస్లిములను చంపకుండా విడిచిపెట్టేసారు అంటూ భారతదేశం అంతటా ఒక సందేశం వెళ్ళిపోతోంది. అలా ఏమీ లేదు. నేను కశ్మీర్లో పర్యటిస్తున్న హిందువును. ఇక్కడ హిందువులకు ముస్లిములతో ప్రమాదం లేదు, ముస్లిములకు హిందువులతో ప్రమాదం లేదు. కశ్మీర్లోకి భారతీయులు రాకూడదన్నది వాళ్ళ లక్ష్యం. కశ్మీరీలు అలా అనుకోవడం లేదు. ఇక్కడకు అందరూ రావాలని భావిస్తున్నారు. ఇక్కడ ఈ సంఘటన జరిగాక మేం భయపడిపోయాం. ఇళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇక్కడ మాకు ఫోన్లు కూడా రావు, వేరే సిమ్ కార్డు తీసుకోవాలి. దాంతో ఇంట్లోవాళ్ళు భయపడిపోతున్నారు. అయితే మాకు డ్రైవర్‌గా వచ్చిన సోదరుడు మాకు ధైర్యం కలిగించాడు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మీ ప్రాణాలు పోనీయం అని చెప్పాడు. అదీ భారతదేశపు సోదర భావం’’ అంటూ ఒక మహిళ మాట్లాడింది.
ఆ వీడియోను పట్టుకుని దేశంలోని నానారకాల వాదులూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసారు. అసలు అక్కడ జరిగినది హిందువులపై దాడి కాదనీ, జాతీయవాద భావజాల ప్రభుత్వం దాన్ని ముస్లిం ఉగ్రవాదులు హిందూమతస్తులను అమానుషంగా హత్య చేసారనే దుష్ప్రచారం చేస్తోందనీ సుద్దులు చెప్పడం ప్రారంభించారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అలా ఎందుకు మాట్లాడింది? అసలు ఎక్కడ మాట్లాడింది?
ఆమె పేరు పూజా జాదవ్. ఆమె గతంలో శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచింది. ఇప్పుడు ఆమె వేరే ప్రదేశం నుంచి ఒక పర్యాటకురాలిలా మాట్లాడింది. పహల్గామ్లో ముస్లిములు గొప్ప సహోదరభావం కలిగిన వారనీ, తమకు పూర్తిగా సహకరిస్తున్నారనీ చెప్పుకొచ్చింది.
పూజా జాదవ్‌తో ఎవరు అలా మాట్లాడించారు అన్న విషయం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అవి ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే ముస్లిములకు, క్రైస్తవులకు, కాంగీయులకు, కమ్యూనిస్టులకు, ఉదారవాదులకు, హిందూ ద్వేషులకు, జాతీయతావాద విద్వేషులకూ ఆ రెండు నిమిషాల వీడియో ఒక ఆయుధంగా అందింది. అంతే. పుట్టలోని పాములన్నీ బుసలు కొడుతూ బైటకు వచ్చేసాయి. ఆమె మాట్లాడిన మాటలకు తమ పైత్యాన్ని జోడించి మరీ రెచ్చిపోసాగాయి. మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు సాధారణ ఉగ్రవాద దాడిని హిందువులే లక్ష్యంగా ముస్లిములు జరిపిన దాడిగా బలవంతంగా చిత్రీకరిస్తున్నాయనీ, సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టడం, తద్వారా వచ్చే యేడాది జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నిస్తున్నాయనీ దుష్ప్రచారం జోరుగా చేస్తున్నాయి.
విశాఖపట్నానికి చెందిన పర్యాటకుడు మధుసూదన్ భార్య, తన చేతిని పట్టుకుని ఉన్న తన భర్తను ఎలా కాల్చి చంపారో చెబుతుంటే గుండెలు అవిసిపోయాయి. నువ్వు హిందువువా అని అడిగి మరీ కాల్చి చంపారనీ, వెళ్ళి మోదీకి చెప్పుకోమంటూ అపహాస్యం చేసారనీ ఆమె చెప్పిన మాటలు తెలుగు అర్ధమయ్యే ఎవరికైనా అర్ధం కావాలి. స్థానిక ముస్లిం దుకాణదారులు ఉగ్రవాదుల కాల్పుల విషయంలో సైతం తప్పుదోవ పట్టించారనీ, హిందువులను ఉగ్రవాదుల తుపాకి గుళ్ళకు ఎర వేసారనీ ఆమె చెప్పిన మాటలు కశ్మీరియత్ నిజరూపాన్ని బైటపెట్టాయి.
భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న మహిళ మాటలను సైతం తప్పుడు మాటలు అంటూ ప్రచారం చేసేవారు ఎలాంటి నీచ నికృష్టులో అర్ధం చేసుకోగలగాలి. ముఖాలకు ఎలాంటి బురఖాలూ తొడుక్కోని ముస్లిం ఉగ్రవాదులు హిందూ కాఫిర్లను హతమార్చాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చేసిన ఘాతుకాన్ని వారేమీ దాచుకోవాలని అనుకోవడం లేదు. కానీ వారిని మంచివారిగా చిత్రీకరించాలనే దుష్ట పన్నాగం, ఇక్కడ కూడా హిందువుల శవాల మీద రాజకీయాలు చేయాలనే కుట్ర ఎవరివో అర్ధం చేసుకోవాలి. అలాంటి దుర్మార్గుల దుష్ప్రచారాన్ని అర్ధం చేసుకుని, అలాంటివారిని తిప్పికొట్టాలి.