మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్గఢ్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్రెగుట్టల్లో వెయ్యి మంది మావోయిస్టులను 20 వేల మంది బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ధర్మతాళ్లపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. పారామిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రె గుట్టల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందుతోంది. కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూంబింగ్ చేపట్టారు. పూజారీ కాంకేర్, పామేడు, భీమవరంపాడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది.
కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో దండకారణ్యంలోని కర్రెగుట్టల ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు, పారామిలటరీ బలగాలు రెండు రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దారిలో మందుపాతరలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అటవీ ప్రాంతంలోకి రావద్దని బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. 20 వేల మంది ఆపరేషన్లో పాల్గొన్నట్లు జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు చీఫ్ దేవాను లక్ష్యంగా కూంబింగ్ నడుస్తోంది.