జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. కరాచీ తీరంలో ఎకనామిక్ జోన్లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్ కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ రంగ నిపుణులు తెలిపారు.
జమ్ము కశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తరవాత భారత్ కఠిన నిర్ణయాలకు సిద్దమైంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం సమావేశమై పాక్‌పై ఆంక్షలు విధించింది. ఢిల్లీలోని పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది. సింధు నదీ జలాల ఒప్పందం విరమించుకుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు బలగాలు నగరంలో తనిఖీలు చేపట్టాయి. రాత్రిపూట గస్తీ పెంచారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బీచ్, పైవ్ స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.