అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించారు. పలువురు అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఆ దుశ్చర్య పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులో భారత్కు కావలసిన ఎలాంటి సహాయమైనా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని జె.డి వాన్స్ స్పష్టం చేసారు. భారత పర్యటనలో ఉన్న వాన్స్ మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారని, ‘ఇస్లామిక్’ ఉగ్రవాదుల దాడి బాధితులకు సంతాపం ప్రకటించారని తెలియజేసారు. భారతదేశానికి ఈ విషయంలో ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారనీ వివరించారు.