కశ్మీర్లో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత పహల్గామ్లో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సమీక్షించారు. ఏప్రిల్ 22 మంగళవారం నాడు ఉగ్రవాదులు దాడి చేసిన బైసరన్ ప్రదేశాన్ని అమిత్ షా ఇవాళ స్వయంగా సందర్శించారు.
సంఘటనా స్థలానికి హెలికాప్టర్లో చేరుకున్న అమిత్ షా తొలుత ఏరియల్ సర్వే చేసారు. ఆ తర్వాత బైసరన్ ప్రాంతంలో దాడి జరిగిన చోట కాలి నడకన సందర్శించారు. ఉన్నతాధికారులు ఆయనకు ప్రస్తుత పరిస్థితి గురించి, జరుగుతున్న ఆపరేషన్స్ గురించీ వివరించారు.
2019లో జమ్మూకశ్మీర్లో 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అత్యంత భయంకరమైన దాడుల్లో ఇదొకటి అని భద్రతా దళాలు భావిస్తున్నాయి.
మరోవైపు, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పహల్గామ్ ప్రాంతంలో సాధారణ పౌరుల మీద జరిగిన భయానకమైన దాడి విషయంలో దర్యాప్తు చేయడానికి, జమ్మూ కశ్మీర్ పోలీసులకు సహకరించడానికీ ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది. ఆ బృందానికి డీఐజీ ర్యాంకు అధికారి నేతృత్వం వహిస్తున్నారు.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తయ్యబా ప్రచ్ఛన్న సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించుకుంది.