జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంత్‌నాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండుగా పేరున్న బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ముష్కరులు అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. అటవీ ప్రాంతం నుంచి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూక 40 మంది పర్యాటకులపై కాల్పులు జరిపారు. కొందరు పర్యాటకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రమూకల కాల్పులతో ఆహ్లాదకర పర్యాటక ప్రాంతం రక్తసిక్తమైంది. మృతదేహాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. గాయపడ్డ వారిని కాపాడాలంటూ పర్యాటకులు హాహాకారాలు చేశారు. కాలినడకన, గుర్రాలపై చేరుకునే ప్రాంతం కావడంతో గాయపడ్డవారిని తరలించడం కష్టంగా మారింది. సైన్యం రంగంలోకి దిగింది. గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద ఘటన విషయం తెలియగానే జెడ్డా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. విషయం తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఘటనా స్థలానికి వెళ్లారు. జమ్ము కశ్మీర్ లెప్ట్నెంట్ గవర్నర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు.
ఉగ్ర మూకలను మట్టుబెట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అణువణువూ గాలింపు చేపట్టారు. ఉగ్రమూకల కాల్పుల శబ్దం వినిపించగానే బైసరన్ ప్రాంతానికి సైనిక బలగాలు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని హెలికాఫ్టర్లు, గుర్రాల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. కాల్పుల ఘటన తరవాత పహల్గాం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 36 రోజుల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొనే అవకాశముంది. అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కి.మీ మీర ఉండగా, 14 కి.మీ గండేర్బల్ జిల్లాలో ఉంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రదాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.