ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ బెంగళూరులో నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. కారులో వెళుతోన్న తనపై కొందరు వ్యక్తులు బైకులతో వెంబడించి దాడి చేశారని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ముందుగా బోస్ దాడికి దిగినట్లు గుర్తించారు.
పుట్‌పాత్‌పై నిలుచుని ఉన్న వికాస్ కుమార్‌పై ముందుగా వింగ్ కమాండర్ బోస్ దాడికి దిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. దాడిని ఆపడానికి ప్రయత్నించిన వారిపై కూడా బోస్ దాడికి దిగినట్లు గుర్తించారు. ఇది పరస్పర దాడిగా పోలీసులు చెబుతున్నారు. గొడవకు కారణం మాత్రం వెల్లడించలేదు.
ఇరువర్గాలు పరస్పరం చేసుకున్న దాడిలా ఉందని, వింగ్ కమాండర్ ముఖంపై రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ వెల్లడించారు. ముందుగా బోస్‌కు ప్రథమ చికిత్స అందించినట్లు చెప్పారు. తరవాత కేసు నమోదు చేయాలని కోరగా ఫ్లయిట్‌కు వెళ్లాల్సి ఉందంటూ వెళ్లిపోయాడని చెప్పారు. ఆయన భార్య మధుమితను కనుగొని ప్రశ్నించినట్లు డిప్యూటీ కమిషనర్ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వింగ్ కమాండర్‌పై వికాస్ హత్యాయత్నం ఫిర్యాదు చేశారు. దీనిపై బోస్‌ను విచారణకు పిలిచారు.