కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ డీజీపీ హత్యకు ఐదు రోజుల ముందు నుంచే ఆయన భార్య పల్లవి గూగుల్ సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఏ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడనే విషయాలను పల్లవి గూగుల్ చేసి వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదాలు, పల్లవి మానసిక పరిస్థితి హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న పల్లవిని ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి విచారణ జరిపారు.
కర్ణాటకలోని మాజీ డీజీపీకి చెందిన 17 ఎకరాల భూమిని కొడుకు, చెల్లి పేరుతో రాయడానికి సిద్దమయ్యాడని, దీన్ని భార్య పల్లవి, కుమార్తె కృతి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తికి సంబంధించి గత కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయని పోలీసులు తెలిపారు. మాజీ డీజీపీ ఓంప్రకాశ్ కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి మాజీ డీజీపీ భార్య పల్లవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన కుమార్తె కృతి పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు.
మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు ముందు ఆయన భార్య పల్లవి వాట్సప్ గ్రూపుల్లో పెట్టిన మెసేజీలు వెలుగులోకి వస్తున్నాయి. తనను గృహనిర్భంధం చేశారని, తన కూతురుకు ప్రాణహాని ఉన్నట్లు ఆమె వాట్సప్ గ్రూపులో మెసేజీలు పెట్టినట్లు గుర్తించారు. మానసిక పరిస్థితి, ఆస్తి గొడవలే మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు.