రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయినా కొత్త ఫించన్లు మంజూరు చేయలేదు. దీంతో ఇప్పటికే 6 లక్షల మంది అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ హయాంలో నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు సమర్పించి వేలాది మంది ఫించన్లు పొందారు. అనర్హులను ఏరి వేసేందుకు దివ్యాంగుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అన్ని కేటగిరీలో 63.32 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2722 కోట్లు ఖర్చు చేస్తోంది. జులైలో అర్హులైన 6 లక్షల మందికి కూడా పింఛన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై ప్రతినెలా రూ.250 కోట్ల భారం పడనుంది.
స్పౌజ్ పింఛన్లు
రాష్ట్రంలో భర్త చనిపోయిన మహిళలకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 డిసెంబరు నుంచి అర్హులైన 89 వేల మంది వితంతువులకు వెంటనే స్పౌజ్ పింఛన్లను జూన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. మేలో అర్హులను గుర్తించి జూన్ నుంచి 89 వేల మందికి స్పౌజ్ పింఛన్లు ఇవ్వనున్నారు.