పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వెళ్ళిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసించే సాకుతో ముస్లిములు దాడులకు పాల్పడిన సంఘటనలు బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో హిందువులను గజగజా వణికించాయి. ఆ దాడుల్లో ముగ్గురు హిందువులు ప్రాణాలు కోల్పోయిన సంగతి, పదుల సంఖ్యలో హిందువులు గాయపడిన సంగతీ, వేలమంది నిర్వాసితులై వేరే ఊళ్ళకు పారిపోయిన సంగతీ తెలిసినవే. ఆ నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాలనీ కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అటువంటి ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. అలాంటి విషయాల్లో రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయలేమంటూ సుప్రీంకోర్టు తమ న్యాయ అధికారాలకు రాజ్యాంగబద్ధమైన హద్దులు ఉన్నాయని వెల్లడించింది.
ఆ పిటిషన్‌ను జస్టిస్ బిఆర్ గవాయి, అగస్టీన్ జార్జి మసీహాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించడానికి మమ్మల్ని రాష్ట్రపతికి రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయమని కోరుతున్నారా? ఇప్పటికే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి చొరబడుతున్నామంటూ మా మీద బోలెడన్ని ఆరోపణలు వచ్చాయి’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ చొరబాటు మీద ఇటీవల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యాయవ్యవస్థ మిగతా వ్యవస్థలను అతిక్రమిస్తోందన్న భావంతో ‘జ్యుడీషియల్ ఓవర్‌రీచ్’ మీద పలువురు రాజకీయ నాయకులు ఆందోళనలు వ్యక్తం చేసారు. తమిళనాడులో గవర్నర్ కొన్ని బిల్లులను ఆమోదించలేదు. వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని ప్రయోగించింది. గవర్నర్లు పంపించిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ, దేశ ప్రథమ పౌరుడి(రాలి)కే కాల పరిమితులు విధించింది. దానిపై తీవ్ర చర్చ మొదలైంది. రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్లో ఒకదాని పనిలో మరొకటి తల దూర్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్న వాదనలు వినవస్తున్నాయి. సుప్రీంకోర్టు తన పరిధిని మీరి ఏకంగా దేశ రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ మేధావులను సైతం నిశ్చేష్టులను చేసింది.
పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి తాజా పిటిషన్ దాఖలవడానికి కారణం ముర్షీదాబాద్‌లో చెలరేగిన హింసాకాండ. వక్ఫ్ చట్టానికి వ్యతిరేక నిరసనలు అనే పేరుతో ముస్లిములు పాల్పడిన దాడుల్లో ముగ్గురు హిందువులు చనిపోయారు. హిందువుల ఇళ్ళు తగులబెట్టేసారు, వారి ఆస్తులు లూటీ చేసారు, హిందువుల దేవాలయాలను ధ్వంసం చేసారు, దేవతా మూర్తులను పగలగొట్టేసారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికే వక్ఫ్ చట్టం అనే సాకును చూపించారనీ, ఆ దాడులకు పాల్పడిన వారి వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందనీ వాదనలు ఉన్నాయి. నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాలనీ, బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిని పునరుద్ధరించడానికి పారామిలటరీ బలగాలను దింపాలనీ పిటిషనర్ కోరారు.
అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు సంయమనం పాటించింది. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ జాగ్రత్తలను బట్టి న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన హద్దులకు కట్టుబడి ఉందని కొంతమంది న్యాయనిపుణులు భావిస్తున్నారు.
కొద్దిరోజుల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిని అధిష్ఠించనున్న జస్టిస్ బిఆర్ గవాయి ముఖ్యమైన కేసుల విచారణలో పాలు పంచుకుంటున్నారు. వక్ఫ్ చట్టానికి సవరణలకు సంబంధించిన సవాళ్ళ కేసుల విచారణలోనూ ఆయన ఉన్నారు. వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలు ఆ వ్యవస్థలో పారదర్శకతను, మెరుగైన పరిపాలననూ తీసుకురావాలన్న ఉద్దేశంతో చేసినవే అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది.