మద్యం కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజ్ కసిరెడ్డి మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ముందస్తు బెయిల్పై తీర్పును హైకోర్టు వాయిదా వేయడంతో, మంగళవారం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతానంటూ రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన తరవాత రాజ్ కసిరెడ్డి పెద్ద మోసకారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. అతని బండారం మొత్తం బయట పెడతానంటూ హెచ్చరించారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరు అవుతానంటూ సోషల్ మీడియాలో రాజ్ కసిరెడ్డి ఓ వీడియో పెట్టారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందుకున్న రాజ్ కసిరెడ్డి, ఇంత వరకు విచారణకు హాజరు కాలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్పై తీర్పు వాయిదా వేయడంతో రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.