జార్ఖండ్లో బొకారో జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడని పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు కీలక నేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై కోటి రివార్డు ఉందని తెలిపారు. నాగ మాంఝీ, కరన్, లెతర, పుచన పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. దేశంలో కోటి రివార్డు ఉన్న నలుగురు మావోయిస్టుల్లో ప్రయాగ్ ఒకరని పోలీసు అధికారులు తెలిపారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రయాగ్ మాంఝీ ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ధనబాద్ జిల్లా తుండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్బుధ ప్రయాగ్ స్వగ్రామం. ఒడిషా, బిహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వందకుపైగా దాడుల్లో ప్రయాగ్ హస్తముందని పోలీసులు ప్రకటించారు. జార్ఖండ్లో అత్యధిక రివార్డు ఉన్న మావోయిస్టు ప్రయాగ్.
నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున బలగాలు కూంబింగ్ చేపట్టాయి. లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో 8 మంది మరణించారు. వారిలో ప్రయాగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
2025 నాటికి మావోయిస్టు రహిత దేశంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బలగాలు మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ పెద్దఎత్తున చేపట్టాయి. ఇప్పటికే ఈ ఏడాది 300పైగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో అగ్రనేతలు సైతం ఉన్నారు. మరికొందరు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. మరో 1200 మంది మావోయిస్టులు ఉండవచ్చని అంచనా.