‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’ అన్న కవి వాక్కు నిజమని మరోసారి నిరూపణ అయింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఎస్పీ నారీ శక్తిని చాటేలా ఒక అడుగు ముందుకు వేసారు. తెలంగాణలో మొదటిసారి మహిళా కమాండోలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు. అదే రోజు, హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా సిఐఎస్ఎఫ్ మహిళలతో కమాండో బృందం భద్రతా విధులు చేపట్టడం విశేషం.
నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జానకీ షర్మిలకు డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీ, ప్రతిభ కలిగిన అధికారి అనే మంచి పేరు ఉంది. ఆమె నాయకత్వంలో మహిళా పోలీసులు కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఇటీవల నిర్మల్ దగ్గర మామడ అడవిలో తునికాకు తెచ్చుకోడానికి వెళ్ళిన నలుగురు మహిళలు దారి తప్పిపోయి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు. వారిని రక్షించేందుకు జానకీ షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. తనతో పాటు మరో నలుగురు మహిళా పోలీసులు కూడా కారడవిలోకి చొచ్చుకుని వెళ్ళి ఆ గిరిజన మహిళలను రక్షించారు. ఆ సంఘటన మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచింది.
ఆ నేపథ్యంలో జానకీ షర్మిల మరో ముందడుగు వేసారు. ‘టీమ్ శివంగి’ పేరుతో రాష్ట్రంలోనే మొదటిసారి మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేసారు. దానికోసం ఆమె తమ దగ్గర అందుబాటులో ఉన్న మహిళా కానిస్టేబుళ్ళను ఎంపిక చేసుకున్నారు. వారికి నిపుణులతో 45 రోజుల పాటు కఠోర శిక్షణ ఇప్పించారు. శారీరక పటుత్వం కోసం వ్యాయామాలు నేర్పించారు. ప్రత్యేక పరిస్థితుల్లో పోరాడేందుకు నైపుణ్యశిక్షణ ఇప్పించారు. ఆధునిక ఆయుధాలను, పేలుడు పదార్ధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ అందజేసారు. అడవుల్లో మ్యాప్ రీడింగ్ ఎలా చేయాలి, అకస్మాత్తుగా తలెత్తే సందర్భాలను బట్టి అప్పటికప్పుడు వ్యూహాలు ఎలా రచించాలి, ఎలా మార్చుకోవాలి, శత్రువుల కదలికలను ఎలా గుర్తించాలి, వాళ్ళను ఎలా ఎదుర్కొనాలి, ఎలా నిలువరించాలి, ఎదురుదాడులు ఎలా చేయాలి వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించారు.
కమాండో ఆపరేషన్స్ చేయడంలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుళ్ళ బృందాన్ని 2025 ఏప్రిల్ 19 శనివారం నాడు నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో, తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి, ఇంకా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రారంభించారు. ఆ సందర్భంగా మంత్రి జిల్లా ఎస్‌పిని, మహిళా కమాండోల బృందాన్నీ అభినందించారు. అలాంటి టీమ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామంటూ వారిలో ఉత్సాహం నింపారు.
అదే రోజు హైదరాబాద్‌లో మరో మహిళా కమాండోల బృందం విధుల్లో చేరింది. అయితే అది పోలీసు బృందం కాదు, విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వర్తించే బృందం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ – సిఐఎస్ఎఫ్ విభాగానికి చెందిన మహిళలు కమాండోలుగా రూపాంతరం చెందారు.
జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అందరికీ శంషాబాద్ విమానాశ్రయంగా సుపరిచితం. అక్కడ మహిళా ప్రయాణికుల భద్రత కోసం సాయుధ మహిళా కమాండోలను మోహరించారు. ఆ విషయాన్ని శంషాబాద్ విమానాశ్రయం అధికారులు శనివారం నాడు వెల్లడించారు. మహిళా కమాండో టీమ్ కోసం సిఐఎస్ఎఫ్‌లోని మహిళలకు నిపుణులు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. విమానాశ్రయాల్లో తలెత్తే ఆపదలు, అలాంటి సందర్భాల్లో క్విక్ రియాక్షన్ టీమ్ స్పందన ఎలా ఉండాలి, ఆయుధాలను ఎలా ఉపయోగించాలి వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 15మందిని ఎంపిక చేసారు. వారికి ఆధునిక ఆయుధాలను అప్పగించి, విమానాశ్రయంలో భద్రతా విధుల్లో చేర్చుకున్నారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ సైడ్ వంటి ప్రాంతాల్లో సందేహాస్పదంగా సంచరించే మహిళలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం, మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించే వారిని నిలువరించడంలో మహిళా కమాండోలు సేవలు అందిస్తారు.
సమాజంలో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే వారు కూడా విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ప్రత్యేకించి, ప్రాకృతికంగా పురుషుల కంటె మహిళలు బలహీనులు అన్న మాటను కూడా వారు తప్పు అని నిరూపించగలరు. ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే. అటు సామాన్య గిరిజనులు ఎక్కువ జనాభా ఉండే నిర్మల్ జిల్లాలోనూ, ఇటు ఆధునిక భారతానికి ప్రాతినిధ్యం వహించే విమానాశ్రయంలోనూ మహిళా కమాండోలు తమ శక్తి సామర్థ్యాలతో ప్రజలకు భద్రత కల్పించడానికి కదం తొక్కుతున్నారు.