తిరుమలలో గోగర్భం జలాశయం సమీపంలో విశాఖ శారదా పీఠం నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లోగా స్వాధీనం చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సత్రం నిర్మించుకునేందుకు విశాఖ శారదా పీఠానికి తిరుమలలో భూమి కేటాయించారు. ఆ భూమి నిబంధనలు ఉల్లంఘించి సెట్ బ్యాక్ వదలకుండా నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. నిబంధనలకు తూట్లు పొడిచారంటూ పలు హిందూ సంఘాలు అప్పట్లో తీవ్ర ఆందోళన చేశాయి.
కూటమి అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. శారదా పీఠం భవనం అప్పగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో శారదా పీఠానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో టీటీడీ 15 రోజుల్లోగా భవనం అప్పగించాలని ఎస్టేట్ విభాగం తాజాగా నోటీసులు జారీ చేసింది.