రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్ పాల్ సింగ్ ఆధ్వర్యంలోని వారిస్ పంజాబ్ దే సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్లో మరికొంత మంది రాజకీయ నాయకులకు కూడా ప్రాణహాని ఉందన్నారు. సోషల్ మీడియాలో లీకైన కొన్ని ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ భద్రతా చట్టం కింద అమృత్ పాల్ నిర్బంధం మరో ఏడాది పెంచడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా కక్ష పెంచుకున్నారని కేంద్ర సహాయ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.
ఎంపీ అమృత్ పాల్ సింగ్ నిర్భందాన్ని పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులపై దాడి కేసులో అమృత్ పాల్ సింగ్ 2023 ఏప్రిల్లో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన అస్సాంలోని ఓ జైలులో ఉన్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి గెలిచారు.పంజాబ్లోని ఖదూర్ సాహెబ్ నియోజకవర్గం నుంచి ఆయన లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు.
వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్దూ చనిపోయిన తరవాత అమృత్ పాల్ సింగ్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నారు. ఖలిస్థానీ కార్యక్రమాలకు పంజాబ్నే స్థావరంగా చేసుకున్నాడు. అజ్ నాలా పోలీసులపై దాడితో ఆయన పేరు దేశమంతా తెలిసింది.