వైసీపీ మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం ఎదురైంది. చిలకలూరిపేట పట్టణంలో ముస్లింలు ఆదివారంనాడు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ కళామందిర్ వద్దకు రాగానే వైసీపీ నేత విడదల రజని ప్రవేశించారు.ముస్లింల నుంచి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా విడదల రజని యాత్రలో ప్రవేశించి కొంత దూరం నడిచారు. యాత్ర చౌత్రా సెంటర్ వరకు రాగానే కొందరు ముస్లింలు రజనిని అడ్డుకున్నారు. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నామని వెళ్లిపోవాలని ముస్లింలు రజనితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెను వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.
పార్లమెంటులో వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి, బయట ర్యాలీల్లో ఎందుకు పాల్గొంటున్నారంటూ మాజీ మంత్రి రజనిని కొందరు ముస్లింలు ప్రశ్నించారు. దీంతో ఆమె అక్కడ నుంచి దూరంగా వెళ్లి, మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక పార్టీల నేతలు ర్యాలీల్లో పాల్గొనడం లేదా అంటూ ప్రశ్నించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.