భారత రాజ్యంగాన్ని రూపొందించినప్పుడు అది 142వ అధికరణం రూపంలో సుప్రీంకోర్టుకు అసాధారణమైన అధికారాన్ని అందించింది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఏదైనా విషయంలో పరిపూర్ణ న్యాయం జరిగేలా చూడడానికి విశేషమైన అధికారాన్ని కల్పించింది. అయితే ఇటీవల ఆ అధికారం సుప్రీంకోర్టుకు సేఫ్టీవాల్వ్ స్థాయిని మించి సూపర్ పవర్‌గా తయారైంది. దాంతో న్యాయవ్యవస్థ తన పరిధులకు మించి వ్యవహరిస్తోందనీ, రాజ్యాంగ సమతౌల్యాన్ని అతిక్రమిస్తోందనీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు గవర్నర్‌కూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య వివాదం మొదలు కొలీజియం నియామకాల్లో ప్రతిష్ఠంభన వరకూ పలు విషయాల్లో 142వ అధికరణం ఇప్పుడు తీవ్రమైన రాజ్యాంగ చర్చకు కేంద్రంగా నిలిచింది.
అసలు ఏమిటి ఈ 142వ అధికరణం?
భారత రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్‌లో ఉన్న విషయం లేదా మరేదైనా ప్రత్యేక సందర్భంలో పరిపూర్ణ న్యాయం చేయడానికి తప్పనిసరి అవసరం అని భావిస్తే ఎలాంటి ఉత్తర్వు లేదా డిక్రీ జారీ చేయవచ్చు. అలాంటి ప్రత్యేకమైన విచక్షణ అధికారం సుప్రీంకోర్టుకు ఈ అధికరణం కల్పించింది.
మొదట్లో దీన్ని ఒక అసాధారణ పరిష్కారంగా భావించి రాజ్యాంగంలో చోటు ప్రవేశపెట్టారు. చట్టాలు స్పష్టంగా లేని చోట్ల, లేదా చట్టాలు మౌనంగా ఉండే సందర్భాల్లో, లేదా న్యాయం జరగడం లేదని భావించిన సందర్భాల్లో ప్రయోగించడానికి ఈ అధికరణాన్ని కల్పించారు. కానీ ప్రస్తుతం ఈ అధికరణాన్ని మామూలు ప్రభుత్వ వివాదాల్లో వాడేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు, కార్యనిర్వాహక అధికారాలు కలిగిన ప్రభుత్వ కార్యాలయాలకు వ్యతిరేకంగా ఈ విచక్షణ అధికారాన్ని వినియోగిస్తున్నారు.
తమిళనాడు బిల్లు వివాదం
2024లో తమిళనాడు గవర్నర్ కొన్ని బిల్లులపై ఆమోద ముద్ర వేయకుండా విత్‌హోల్డ్‌లో పెట్టి ఉంచారు, వాటిలో కొన్ని పరిశీలనలో ఉన్నాయి. అలా గవర్నర్ దగ్గర ఉన్న 11 బిల్లులను ప్రభుత్వం ఆయన ఆమోద ముద్ర లేకుండానే పాస్ చేసింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వపు ఆ చర్య రాజ్యాంగంలోని 200వ అధికరణం స్ఫూర్తిని ఉల్లంఘించింది.
విషయాన్ని రాష్ట్రపతి ముందర పెట్టడం, లేదా రాజ్యాంగ వ్యవస్థలను పని చేయనీయడం కాకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 142వ అధికరణం సహాయంతో ‘బిల్లులు పాస్ అయినట్లే’ అని తీర్పు చెప్పేసింది.
ఇది ఎందుకు ముఖ్యమైన అంశం?
గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్‌ను అతిక్రమించడం అంటే పరోక్షంగా రాష్ట్రపతి మీద ఒత్తిడి పెట్టడమే, కేంద్రానికి రాజ్యాంగబద్ధంగా ఉండే పాత్రను పక్కకు నెట్టేయడమే. ఈ పద్ధతి ఓ కొత్త పూర్వోదాహరణకు (ప్రిసిడెంట్) దారి తీసింది. ఎన్నికైన లేక నియమితులైన కార్యనిర్వాహక అధికారుల అభ్యంతరాలు లేక జాప్యాలను ఇకపై కోర్టులు అతిక్రమించవచ్చు.
ఇక్కడ కోర్టు చేసినది చట్ట సమీక్ష కాదు. నేరుగా చట్టాన్ని అమలు చేయడమే. అంతే స్వభావ రీత్యా దాదాపు శాసన వ్యవస్థలాగే పని చేసిందన్న మాట.
న్యాయ వ్యవస్థ వెర్సెస్ రాష్ట్రపతి : దోబూచులాట
ఈ కేసులో ప్రత్యక్షంగా రాష్ట్రపతి పేరు ప్రస్తావించలేదు కానీ దాని అంతరార్థం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. గవర్నర్ ఒక బిల్లును విత్‌హోల్డ్‌లో పెట్టాలని భావించి, దాన్ని సలహా కోసం రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే ఆ ప్రక్రియను న్యాయవ్యవస్థ 142వ అధికరణం సాయంతో అతిక్రమించగలదు.
ఈ పరిస్థితి తీవ్రమైన రాజ్యాంగ ప్రశ్నకు దారి తీస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి ఉండే నిర్ణయాలు చేయడానికి గల అధికారాల మీద, సుప్రీంకోర్టు తాము న్యాయం అని భావించిన దాన్ని, వర్తింపజేయగలదా?
దానికి జవాబు నేరుగా ఏదీ లేదు. కానీ దాని అంతరార్థం మాత్రం ప్రమాదకరం.
కొలీజియం గొడవ: 142 విశేషాధికారాలకు మరో ఉదాహరణ
2015నాటి ఎన్‌జేఏసీ తీర్పులో సుప్రీంకోర్టు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జెఎసి) ఏర్పాటును కొట్టిపడేసి, కొలీజియం పద్ధతిని పునరుద్ధరించింది. ఆ పద్ధతిలో నియామకాలు జరపడంలో కేంద్రం జాప్యం చేసినప్పుడు తమ జ్యుడీషియల్ సెలక్షన్స్ని అమలు చేయడానికి 142వ అధికరణాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించింది.
ఇంక 2023 వచ్చేసరికి సుప్రీంకోర్టు నేరుగానే ‘‘మేం చెప్పినట్లు నియామకాలు జరపకపోతే రాజ్యాంగ అధికరణం 142ను ప్రయోగించడానికి మేము సిద్ధపడాల్సి ఉంటుంది’’ అని చెప్పడం మొదలుపెట్టింది.
అలా, రాజ్యాంగ అధికరణం 124 కింద సుప్రీంకోర్టు జడ్జిలను నియమించే రాజ్యాంగబద్ధ అధికారి అయిన రాష్ట్రపతినే న్యాయస్థానాలు నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాయి. ఇంక మిగిలింది ఏంటంటే రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ లాగ పని చేయడమే. కార్యనిర్వాహక వ్యవస్థతో సంప్రదింపులకు ఏ ఆస్కారమూ లేకుండా న్యాయ వ్యవస్థ ఏం ప్రతిపాదిస్తే దాన్ని, ఏం అమలు చేస్తే దాన్ని ఆమోదించడమే రాష్ట్రపతి పనిగా మిగిలిపోయింది.
కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోగలదా?
న్యాయ వ్యవస్థ అతి జోక్యాన్నీ, ఇతర వ్యవస్థల అతిక్రమణనూ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోగలదా అని ప్రశ్నించుకుంటే అవును అనే జవాబు వస్తుంది. కానీ దానికి కావలసిన ఉపకరణాలు చాలా తక్కువ, అవి కూడా చాలా నెమ్మదిగా పని చేస్తాయి.
అధికరణం 131: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ పరమైన విభేదాలను పరిష్కరించగలదు.
అధికరణాలు 256, 257: కేంద్ర చట్టాలను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తాయి.
అటార్నీ జనరల్: అంగీకారం కోసం లేదా ధిక్కారానికి వ్యతిరేకంగా కేసు పెట్టగలరు.
కానీ వాటన్నిటికీ చాలా సమయం పడుతుంది. అదే సమయంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తక్షణమే స్పందించగలదు, అది కూడా చాలాసార్లు ఎలాంటి జవాబుదారీతనం లేకుండానే అమలు చేసేయగలదు.
సమాఖ్య విధానం ప్రమాదంలో ఉందా?
భారతదేశ ప్రజాస్వామ్యం ఒక సమతౌల్య విధానంపై ఆధారపడి ఉంది. కేంద్రం, రాష్ట్రాలు, న్యాయ వ్యవస్థ, రాష్ట్రపతి అందరూ తమతమ నిర్దిష్టమైన పాత్రలు పోషిస్తారు. కానీ ఆర్టికల్ 142 ఒక పద్ధతిగా మారిపోతే న్యాయ వ్యవస్థ మిగతా అన్ని వ్యవస్థల పైనా ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడుతుంది.
142వ అధికరణాన్ని విపరీతంగా వాడడం ద్వారా సుప్రీంకోర్టు
(అ) చట్టాలను తనకు నచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది.
(ఆ) తన సొంత తీర్పులను అమలు చేస్తుంది.
(ఇ) శాసన – కార్యనిర్వాహక వ్యవస్థలను అతిక్రమిస్తుంది.
అలా పనిచేయడం సుప్రీం కోర్టును రాజ్యాంగానికి వ్యాఖ్యానం చేసే స్థాయి నుంచి సూపర్-గవర్నమెంట్‌గా పని చేసే స్థాయికి మార్చేస్తుంది.
న్యాయమా? ఆధిపత్యమా?
రాజ్యాంగ అధికరణం 142 అనేది ఒక ఫైర్ అలారం లాంటిది. అసాధారణ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఉపయోగించాలి. కానీ, న్యాయ కార్య నిర్వాహక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయం వచ్చిన ప్రతీసారీ దాన్ని ఉపయోగించేస్తుంటే, దాని అసాధారణ స్వభావం నశించిపోతుంది.
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని పరిశీలించేవారికి, ఈ దేశపు బాధ్యతాయుతమైన పౌరులకు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న అదే. ‘‘న్యాయపరంగా విసిరే ప్రతీ దెబ్బా పరోక్షంగా రాష్ట్రపతి భుజాలకే తగులుతుంటే, రాష్ట్రపతి అధికారాలు ఏమవుతాయి?’’
ఇది కేవలం చట్టపరమైన యుద్ధం మాత్రమే కాదు. ఇది మన గణతంత్ర స్వరూపాన్ని కాపాడుకోవలసిన అవసరం.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం