కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా శరావతినగరలో ఆదిచుంచనగిరి స్కూల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలు తీయించిన అధికారి మీద ఎఫ్ఐఆర్ నమోదయింది.
నటరాజ్ భాగవత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత 2023లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, విద్యార్ధులను తమ ఒంటిమీది మతచిహ్నాలను తొలగించేలా అధికారులు ఆదేశించడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోడానికి విచారణ ప్రారంభమైంది.
ఆ సంఘటనపై కర్ణాటక ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పందించారు. జరిగినది దురదృష్టకరమైన సంఘటన అని చెబుతూ, అలాంటి సంఘటనే బీదర్లో మరో పరీక్షా కేంద్రం దగ్గర కూడా జరిగిందని ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి ధ్రువీకరించారు. ఆ రెండు పరీక్షా కేంద్రాలూ తప్ప రాష్ట్రంలోని మిగతా అన్ని చోట్లా పరీక్ష నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగిపోయింది అని మంత్రి చెప్పుకొచ్చారు. ‘‘విద్యార్ధుల వద్ద ఏమైనా పరికరాలు ఉన్నాయా అని తనిఖీ చేయాల్సిన వ్యక్తులకు, యజ్ఞోపవీతాల వంటివి తీసేయాలన్న ఆదేశాలు ఎప్పుడూ జారీ చేయలేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘పరీక్ష రాయాలంటే విద్యార్ధి ఒంటి మీద ఇలాంటి చిహ్నాలను తొలగించాలని ఎప్పుడూ ప్రస్తావించలేదు. మేము అన్ని మతాలను, అందరి విశ్వాసాలనూ గౌరవిస్తాం. జరిగిన చర్యను మేము ఆమోదించడం లేదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్ధులతో వారి జందేలను బలవంతంగా తీయించిన సంఘటన కేవలం మతపరమైన భావోద్వేగాలను గాయపరిచేదిగా మాత్రమే కాక, విద్యార్ధులకు తమ మతాన్ని పాటించే హక్కును ఉల్లంఘించడంగా కూడా నిలిచింది.
ఆ చర్యను బ్రాహ్మణ వ్యతిరేక, హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ, శివమొగ్గ జిల్లాలోని వివిధ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య తీవ్రంగా ఖండించాయి.
బీదర్ జిల్లాలో సాయిస్ఫూర్తి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా అలాంటి సంఘటనే జరిగింది. అక్కడ గణిత పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్ధిని జందెం తీసేయమన్నారు. అతను దానికి నిరాకరించడంతో బలవంతంగా లాగేసారు. దాంతో ఆ విద్యార్ధి తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. దిగ్భ్రాంతికరమైన ఆ చర్య కారణంగా అతను ప్రవేశ పరీక్ష సరిగ్గా రాయలేకపోయాడు.
బ్రాహ్మణ విద్యార్ధుల పట్ల ఈ వివక్ష, యధాలాపంగా జరిగిన ఒక దుర్ఘటన కాదు. విద్యా సంస్థల్లో ఏకరూపత పేరుతో విద్యార్ధుల విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలను అవమానించే విధానం నానాటికీ పెరుగుతోందనడానికి నిదర్శనం.