పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో రెచ్చిపోయి బైటకు వచ్చి ఉద్రేకంలో చేసిన దాడులు కావన్న సంగతి ఇప్పుడు బైటపడింది. హిందువులపై దాడులు చేయాలనే ముందస్తు కుట్ర పన్ని, ఆ మేరకు వారి ఇళ్ళకు ఆనవాళ్ళు కూడా పెట్టారన్న సంగతి వెల్లడైంది. ‘ఎన్ఎంఎఫ్ న్యూస్’ అనే వార్తాసంస్థ విలేఖరి ఈ విషయాన్ని బైటపెట్టారు.
‘‘హిందువుల ఇళ్ళకు ఉద్దేశపూర్వకంగా నల్ల రంగు పూసారు. దాన్ని బట్టి ఏ ఇళ్ళపై బాంబులు వేయాలి, ఏ ఇళ్ళకు నిప్పు పెట్టాలి అన్న విషయాన్ని గుర్తించడం వాళ్ళకు సులువు అయింది. ఆ హింసాకాండ క్షణికావేశంలో చేసింది కాదు, చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేసిన హింస అది. ఆ ప్రాంతంలోని ప్రతీ హిందువు ఇంటికీ నల్ల రంగు పూసారు. ఆ ఇళ్ళపైన మాత్రమే దాడులు జరిగాయి. వాటి మీద మాత్రమే బాంబులు పడ్డాయి. ఆ ఇళ్ళకు మాత్రమే నిప్పు అంటించారు’’ అని ఆ విలేఖరి వివరించారు.
ముర్షీదాబాద్ ప్రాంతంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న సూతీ, షంషేర్‌గంజ్ జిల్లాల్లో 2025 ఏప్రిల్ 11న జుమ్మా నమాజ్ అయిన వెంటనే హింసాకాండ ప్రజ్వరిల్లింది. కేంద్రం ఇటీవల చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసన పేరుతో అశాంతి మొదలైంది, కానీ అది కొన్ని క్షణాల్లోనే హిందువులపై పూర్తిస్థాయి దాడిగా రూపు మార్చుకుంది. ముస్లిం అల్లరిమూకలు హిందువుల ఇళ్ళను, దుకాణాలను ఎంపిక చేసుకుని మరీ లక్ష్యం చేసుకున్నారు. లూటీలు, దహనాలు, దాడులు యధేచ్ఛగా జరిగిపోయాయి.
సూతీ పట్టణంలో ఒక మిఠాయి దుకాణం నడుపుకున్న హిందూ దంపతులు ఆనాటి హింస గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఈ తగలబడిపోయిన దుకాణమే మా శుభ స్మృతి హోటల్. వాళ్ళు మా దుకాణంలో ఉన్న నగదు, వస్తువులు అన్నీ కొల్లగొట్టారు. ఇంకేమీ మిగల్చలేదు, మాకు కనీసం తినడానికైనా ఏమీ లేదు. మేం ఎలా బతకాలి?’’ అని వారు ప్రశ్నించారు. దుండగులు ‘శ్రీ హరి హిందూ హోటల్ అండ్ లాడ్జ్’ను కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు. ఆ దృశ్యాలను ఎఎన్ఐ వార్తాసంస్థ నమోదు చేసింది.
ఆ హింసాకాండలో దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. దేవతా మూర్తులను పగలగొట్టారు. జంగీపూర్‌లోని ఒక ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఖలీలుర్ రెహమాన్ చెప్పుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాలో హిందూ కుటుంబాలకు చెందిన వందలాది ఇళ్ళపై దాడులు జరిగాయి, దుకాణాలను దోచుకుని తగలబెట్టేసారని ఇండియాటుడే నివేదిక వెల్లడించింది.
ఇండియాటుడే నివేదికలో ఇంకో దారుణమైన సంగతి బైటపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక ఆంబులెన్స్ నుంచి డ్రైవర్‌ను బైటకు లాగి చితకబాదారు, ఆ తర్వాత ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టేసారు. ‘‘మేం భయంతో వణికిపోయాం. మా ఇళ్ళలో దాక్కుని ఉండిపోయాం. నేను నా తల్లిదండ్రులూ, భార్యాపిల్లలను లోపల దాచిపెట్టాను. దాడి చేసిన వాళ్ళు స్థానిక ముస్లిములే’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు.
పరిస్థితులు దారుణంగా చేజారిపోవడంతో వేలాది హిందువులు తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోక తప్పలేదు. వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నది దాటి మాల్దా జిల్లాలోకి తరలిపోయారు. ముస్లిం మూకలు తమ ఇంట్లోకి వస్తుంటే మేడ మీద దాక్కుని ఉన్న తాము ఎలా గజగజా వణికిపోయారో ఒక బాధితుడు వివరించాడు.
అమర్ భగత్ అనే వ్యాపారి భార్య మంజూ భగత్ తమ అనుభవాన్ని ఇలా వివరించారు. ‘‘వాళ్ళు మా ఇంటి ముందు గేటు తెరుచుకుని లోపలికి రావడానికి ప్రయత్నించారు. అది తెరుచుకోలేదు. అప్పుడు వాళ్ళు వెనుకవైపు తలుపు పగలగొట్టుకుని వచ్చారు. మా మోటార్‌సైకిల్‌ని విరగ్గొట్టేసారు. మా ఇంటిని ధ్వంసం చేసారు. కుర్చీలు, పరుపులు, టీవీలు, ఇంట్లో ఉండే విలువైన వస్తువులు అన్నింటినీ విరగ్గొట్టేసారు’’ అని చెబుతూ కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
హింసాకాండ జరిగినంత సేపూ పోలీసులు అక్కడకు రానే లేదు. దాంతో హిందువుల భయానికి అంతే లేకుండా పోయింది. ‘‘ఆ రాత్రి మాకు నిద్ర పట్టలేదు. భయంభయంగా మెలకువగా ఉన్నాం. హింస జరిగినంత సేపూ ఒక్క పోలీసు కూడా రాలేదు. వాళ్ళు కూడా తమ ప్రాణాలు కాపాడుకోడం కోసం పారిపోయారు’’ అని ఒక బాధితుడు చెప్పాడు.
ముర్షీదాబాద్, పరిసర ప్రాంతాల్లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని ముస్లిం అతివాదులు ప్రణాళికాబద్ధంగా దాడులు చేసిన సంగతి బైటపడడంతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికార వర్గాలు ఉన్నాయి, అయితే హిందువు ఇళ్ళను ఎంచుకుని మరీ చేసిన దాడులు, ఆ సమయంలో పోలీసుల ఉనికే లేకుండా పోవడం ఈ దాడుల్లో కుట్ర కోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. దాడులు జరిగి వారం దాటిపోయినా ఇప్పటికీ ఆ భయం బాధితులను వదిలిపెట్టలేదు. ఎప్పటికైనా తమకు న్యాయం జరగుతుందనీ, పరిహారం అందుతుందనీ కొందరు బాధితులు ఆశిస్తున్నారు.
ముర్షీదాబాద్ హింసాకాండ పశ్చిమ బెంగాల్లో నానాటికీ పెరుగుతున్న జాతివైరాల తీవ్రతకు తాజా ఉదాహరణగా నిలిచింది. ఆ ప్రాంతంలో హిందువులపై జరుగుతున్న హింసాకాండ దీర్ఘకాలిక ప్రభావాలను కళ్ళకు కట్టింది. ఎన్ఎంఎఫ్ న్యూస్ విలేఖరి కనుగొన్న భయంకరమైన వాస్తవం, ముందస్తు ప్రణాళికతో హిందువులను అంతమొందించడానికి జరిగిన కుట్రను బైటపెట్టింది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో హిందూ మైనారిటీలకు రక్షణ అనేది ఎండమావే అన్న నిజం మెల్లమెల్లగా అర్ధమవుతోంది.