మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం వ్యవహారం మొత్తం రాజ్ కసిరెడ్డే చూశాడంటూ సమాచారం అందించిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నాలుగోసారి నోటీసులు జారీ చేశారు.
రాజ్ కసిరెడ్డి పెద్ద మోసగాడు అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజశేఖర్‌రెడ్డి ఆడియో మెసేజ్ ద్వారా స్పందించారు. విజయసాయిరెడ్డి పెద్ద బట్టేబాజ్ అని, అతని చరిత్ర మొత్తం బయట పెడతానని, అప్పటి వరకు వన్ సైడ్ వార్తలు రాయవద్దని రాజ్ కసిరెడ్డి మీడియాను కోరారు.
సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తనను అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ తన లాయర్ల సలహా మేరకు హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. తనను ఎందుకు విచారించాలనుకుంటున్నారో సమాచారం ఇవ్వాలని గతంలోనే మెయిల్ ద్వారా సిట్ అధికారులను కోరినట్లు రాజ్ కసిరెడ్డి గుర్తుచేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం నోటీసులు జారీ చేసి హాజరు కావాలని చెప్పారని రాజ్ కసిరెడ్డి చెప్పారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. విజయవాడ సీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆరుగురు సీనియర్ అధికారులు విచారణ జరుపుతున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అందించిన సమాచారం అధారంగా ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.