సైబర్ నేరగాళ్లు బరితెగించారు. లాటరీ తగిలిందని, ఎయిర్పోర్టులో కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు ఎప్పటి కప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఆధ్యాత్మిక యాత్రలు చేసే వారే లక్ష్యంగా మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, యాత్రీకుల నుంచి నగదు కాజేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. స్పాన్సర్డ్ సైట్లను క్లిక్ చేసే ముందు అవి అసలైనవా, నకిలీవా చెక్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల కాలంలో ఆధ్వాత్మిక యాత్రలు, ముఖ్యంగా అమర్నాథ్, కేథార్నాథ్, బద్రీనాథ్ యాత్రలు చేసే వారికి హెలికాఫ్టర్ సేవలు, బస్సు, టాక్సీ, గదులు, బస ఏర్పాట్లు అంటూ నకిలీ వెబ్సైట్ల ద్వారా డబ్బు కాజేస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయి. వేలాది మంది డబ్బు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఇలాంటి మోసాల భారిన పడిన వారు వెంటనే 1930 నెంబరుకు కాల్ చేసి వివరాలు అందించాలని కోరింది. cybercrime.gov.in వెబ్సైటు ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని కేంద్ర హోం శాఖ సూచించింది.