బంగ్లాదేశ్‌లో తాజాగా హిందూ నాయకుడు ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేసారు. దుండగులు తీవ్రంగా కొట్టినందునే భబేష్ గాయపడి ప్రాణాలు కోల్పోయాడని వారు స్పష్టం చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దినాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ళ భబేష్ చంద్రరాయ్ అనే హిందూ నాయకుడికి గురువారం సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తను ఇంట్లోనే ఉన్నట్లుగా ఫోన్ చేసిన వారికి చెప్పారు. మరికాసేపటికి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆయన ఇంటికి చేరుకున్నారు. భబేష్‌ను బలవంతంగా ఇంటినుంచి బైటకు తీసుకుని వెళ్ళారు.
అయితే భబేష్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు భబేష్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు. వారికి నరబరి అనే గ్రామంలో భబేష్ తీవ్ర గాయాల పాలైన స్థితిలో కొనవూపిరితో కనిపించారు. పోలీసులు భబేష్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. భబేష్ ఆస్పత్రికి చేరుకునేలోగానే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఆ సంఘటనపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. ‘‘ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది ఇంకొక సంఘటన. గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన వారు ఏ శిక్షా లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ సాకులూ చెప్పకుండా, ఎలాంటి వివక్షా చూపకుండా, మైనారిటీలను రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాం’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేసారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశం విడిచిపెట్టి, భారతదేశంలో ఆశ్రయం పొందిన తర్వాత ఆ దేశంలో మైనారిటీల మీద దాడులు పెచ్చుమీరి పోయాయి. ప్రత్యేకించి హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగని రోజంటూ లేకుండా పోయింది. హిందువులను హత్యలు చేయడం, హిందువుల దుకాణాలను లూటీ చేయడం, హిందువుల మందిరాలను, పవిత్ర ప్రార్థనా స్థలాలనూ ధ్వంసం చేయడం, హిందూ దేవీ దేవతల విగ్రహాలను పగలగొట్టడం వంటి పనులు నిత్యకృత్యం అయిపోయాయి.