తమిళనాడు ప్రభుత్వపు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి కాలపరిమితి విధించడం రాజ్యాంగపరమైన చర్చకు దారి తీసింది. న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోకి చొరబడడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఆ విషయమై ఇప్పటివరకూ ప్రభుత్వ పెద్దలు ఎవరూ నేరుగా మాట్లాడలేదు. న్యాయవాది కూడా అయిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఒక్కరే, ఇటీవల ఒక సమావేశంలో న్యాయవ్యవస్థ తీరును కడిగిపడేసారు.
రాజ్యసభ ఇంటర్న్‌ల ఆరవ బృందం గురువారం ఉపరాష్ట్రపతి అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమైంది. ఆ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ భారతదేశపు న్యాయ వ్యవస్థ ఏమాత్రం జవాబుదారీతనం లేని సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తోందంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. న్యాయ వ్యవస్థలో ఇటీవలి పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉండాల్సిన అధికార సమతూకం గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
మార్చి 14, 15 తేదీల మధ్య రాత్రి వేళ న్యూఢిల్లీలోని ఒక న్యాయమూర్తి నివాసంలో భారీ మొత్తంలో డబ్బులు దొరికిన సంఘటన గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత వరకూ, అంటే మార్చి 212 వరకూ ఆ వ్యవహారం గురించి బాహ్య ప్రపంచానికి తెలియలేదు. దాని గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి ఇలా అన్నారు. ‘‘ఆ సంఘటన జరిగి నెల రోజులు దాటిపోయింది. అది ఒక పాపాల పుట్టే అయి ఉండవచ్చు, ఈ పాటికి ఆ పుట్ట పగిలిపోయి ఉండాల్సింది. ఆ నేరాల సంగతి ప్రజలకు తెలియాలి. అప్పుడే పాప ప్రక్షాళన మొదలవుతుంది.’’
జడ్జి ఇంట్లో కోట్ల కొద్దీ నగదు దొరికిన సంఘటన విషయంలో జాప్యం జరుగుతుండడం, దాన్ని రహస్యంగా ఉంచడాన్ని ఉపరాష్ట్రపతి నిలువునా ప్రశ్నించారు. ప్రజలు ఆ విషయంలో ఆందోళనతో, ఆవేదనతో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. నేరం జరిగిందన్నట్లుగా సుప్రీంకోర్టు సంకేతాలు ఇస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు కాలేదన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘శిక్షించదగిన ప్రతీ నేరమూ పోలీసులకు రిపోర్ట్ చేయాలి. అలా చేయడంలో విఫలం అవడం కూడా నేరమే’’ అన్నారు. రాజ్యాంగం ఇవ్వని ‘నిరోధక శక్తి’ని (ఇమ్యూనిటీ) న్యాయమూర్తులు ఎలా అనుభవించగలుగుతున్నారు అని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు.
‘‘ఆ వ్యవహారంలో విచారణ జరపడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పడింది. కానీ విచారణ జరపడం అనేది కార్యనిర్వాహక వ్యవస్థ చేయవలసిన పని. రాజ్యాంగంలో కానీ, పార్లమెంటు ఆమోదించిన ఏ చట్టంలో కానీ అలాంటి కమిటీకి ఏ హోదా లేదు. అది కేవలం సిఫారసులు చేయగలదు. అయితే ఆ సిఫారసులు ఎవరికి చేస్తారు? దేనికోసం చేస్తారు? న్యాయమూర్తులపై చర్యలు తీసుకోగల సంవిధానం ఒక్క పార్లమెంటు చేతిలోనే ఉంది’’ అని ధన్‌ఖడ్ వివరించారు. అసలు అలాంటి కమిటీ ఇచ్చే నివేదికకు స్వతహాగానే చట్టబద్ధత లేదు అని స్పష్టం చేసారు. న్యాయప్రక్రియలను బైపాస్ చేస్తున్నారని కుండ బద్దలుగొట్టి మరీ చెప్పారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యవస్థాగతమైన అతిక్రమణల గురించి హెచ్చరించారు. ‘‘శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు మూడూ తమతమ సొంత పరిధుల్లో వికసించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ అకస్మాత్తుగా దాడి చేయడం సవాళ్ళను సృష్టిస్తుంది, అది మంచిది కాదు’’ అని స్పష్టం చేసారు. కార్య నిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు, దేశ ప్రజలకూ జవాబుదారీగా ఉంటుందనీ, న్యాయ వ్యవస్థకు ప్రత్యక్షంగా అలాంటి జవాబుదారీతనం ఏదీ లేదనీ జగదీప్ ధన్‌ఖడ్ పునరుద్ఘాటించారు.
ఈ యేడాది జనవరిలో జారీ అయిన ఒక లోక్‌పాల్ ఉత్తర్వును ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. దాని ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల మీద వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపవచ్చు. అయితే ‘న్యాయ వ్యవస్థ స్వతంత్రం’ (జ్యుడీషియల్ ఇండిపెండెన్స్) పేరిట ఆ ఉత్తర్వుపై స్టే విధించారు. తమపై ఎలాంటి తనిఖీలూ జరగకుండా కాపాడుకునేందుకు కవచంగా జ్యుడీషియల్ ఇండిపెండెన్స్‌ను దుర్వినియోగం చేయడాన్ని ధన్‌ఖడ్ ప్రశ్నించారు. ‘‘జ్యుడీషియల్ ఇండిపెండెన్స్ అనేది విచారణ నుంచి తప్పించుకోడానికి మార్గం కాదు, వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని స్పష్టం చేసారు.
ధన్‌ఖడ్ తన ప్రసంగంలో 1993 నాటి సెకెండ్ జడ్జెస్ కేసు గురించి కూడా ప్రస్తావించారు. జ్యుడీషియల్ నియామకాల విషయంలో భారతదేశపు ప్రధాన న్యాయమూర్తితో (సీజేఐ) ‘సంప్రదింపులు’ (కన్సల్టేషన్) జరపడాన్ని ఆ కేసు ‘ఐకమత్యం’గా (కంకరెన్స్) వ్యాఖ్యానించింది. అంటే వారూ వారూ ఒక్కటిగా కలిసిపోయి కొత్త జడ్జిలను నియమిస్తారన్న మాట. సీజేఐకి అలాంటి వీటో అధికారాన్ని ఇవ్వరాదంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించిన సంగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కోర్టులు ఒక విషయం మీద మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానాలు చేయడం అనేది ప్రమాదకర ప్రతిపాదన అని అంబేద్కర్ చెప్పారు. భారత రాజ్యాంగం కన్సల్టేషన్, కంకరెన్స్ పదాలను వేర్వేరుగా ఉపయోగిస్తుంది. ఒకే అధికరణంలో ఆ రెండు పదాలకూ వేర్వేరు అర్ధాలు ఉన్నాయి, కానీ పరమ సూక్ష్మమైన ఆ భేదం ఇప్పుడు విస్మరించబడుతోంది అని జగదీప్ ధన్‌ఖడ్ వివరించారు.
వ్యవస్థ మౌలిక నిర్మాణమనే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ఇటీవల చాలా గొప్పదానిలా వర్ణిస్తూ ఒక పుస్తకం వెలువరించారు. దాన్ని ఉపరాష్ట్రపతి తప్పుపట్టారు. మౌలిక నిర్మాణం అనే సిద్ధాంతం ఉన్నా 1975 నాటి ఎమర్జెన్సీలో ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిన సంగతిని గుర్తు చేసారు. ‘‘రాజ్యం అణచివేత దుర్మార్గాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని సూక్తులు చెప్పిన న్యాయస్థానమే, ఆ రక్షణలను కాలరాసింది’’ అని వెల్లడించారు. ఆ పుస్తకం రాసిన న్యాయమూర్తి కొన్ని విషయాలను మాత్రమే గుర్తుంచుకోవడాన్నీ, కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడాన్నీ, సద్విమర్శకు తావు లేకపోవడాన్నీ ధన్‌ఖడ్ తప్పుపట్టారు.
ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ఆందోళన వెలిబుచ్చిన ప్రధానమైన అంశం భారత రాష్ట్రపతి అధికారాల్లోకి సైతం న్యాయ వ్యవస్థ చొచ్చుకొనిపోడానికి ప్రయత్నాలు చేయడం. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చే సందర్భంలో రాష్ట్రపతికే కాల పరిమితులు విధించింది. ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘మనం ఏ దిశగా పయనిస్తున్నాం? న్యాయమూర్తులే ఇప్పుడు చట్టాలు చేసేస్తారు, కార్యనిర్వాహక వర్గం పనులూ తామే చేసేస్తారు, ఇప్పుడు రాష్ట్రపతికే ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు జవాబుదారీతనం లేకుండా, సూపర్ పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగదీప్ ధన్‌ఖడ్ న్యాయమూర్తులకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘ఎన్నికల్లో అభ్యర్ధులు, ఎన్నిక అయినవారు తమ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తులకు తమ ఆస్తులను వెల్లడించడం ఎందుకు తప్పనిసరి కాదు, ఈ దేశపు చట్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్తిస్తున్నట్లుంది’’ అని నిలదీసారు. ‘‘ఏదైనా విషయంలో పరిపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టు ఎలాంటి డిక్రీ లేదా ఆదేశాన్ని అయినా జారీ చేయవచ్చు అని చెప్పే రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని సుప్రీంకోర్టు ప్రజాస్వామిక శక్తుల మీద న్యూక్లియర్ మిసైల్‌లా వాడుకుంటోంది’’ అని జగదీప్ ధన్‌ఖడ్ వివరించారు. 142వ అధికరణాన్ని తమకు అనుకూలంగా వ్యాఖ్యానించుకుంటూ న్యాయవ్యవస్థ తన పరిధిని విస్తరించుకుంటూ పోతోందని ఆందోళన వ్యక్తం చేసారు.
ఆ నేపథ్యంలో, భారత ప్రజాస్వామ్యాన్ని భరిస్తున్న శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, రాజ్యాంగబద్ధమైన పరిమితులను గౌరవించేందుకు, అధికారాన్ని సమతూకంగా పంచుకునేలా వ్యవస్థలను పునర్మూల్యాంకనం చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని జగదీప్ ధన్‌ఖడ్ తేల్చి చెప్పారు.