జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒకరు నూరు శాతం పర్సంటైల్ సాధించారు. తెలంగాణ నుంచి
బనిబ్రత, అజయ్‌రెడ్డి 300 మార్కులు సాధించడంతో ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. ర్యాంకుల కేటాయింపులో వయసు కొలమానం తొలగించడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా మొదటి ర్యాంకు దక్కే అవకాశముందని తెలుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం తుది కీ విడుదల చేసిన ఎన్‌టీఏ, అర్థరాత్రి ర్యాంకులు విడుదల చేసింది. మొదటి ర్యాంకు సాధించిన అజయ్‌రెడ్డిది నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తాటిపాడు గ్రామం. 9వ తరగతి నుంచి అజయ్‌రెడ్డి హైదరాబాదులో విద్యాభ్యాసం చేస్తున్నారు.జనరల్ విభాగంలో 93.102 కటాఫ్ ర్యాంకు పర్సంటైలుగా నిర్ణయించారు. ఇది గత ఏడాది 93.236గా ఉంది.
జేఈఈ మెయిన్స్ 14.75 లక్షల మంది పరీక్షలు రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్‌లో 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61, ఎస్టీ 47.90 పర్సంటైల్ స్కోర్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు. మే 18న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
రెండు విడతల్లో మొత్తం 24 మంది విద్యార్థులు నూరు శాతం పర్సంటైల్ సాధించారు. తెలంగాణ నుంచి బనిబ్రత, ఎ.గుప్తా, అజయ్‌రెడ్డి, ఏపీ నుంచి సాయి గుత్తికొండ ఉన్నారు.