ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు వరం ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లుగా పనిచేస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. అది కూడా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024 మే నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక మతాన్ని ప్రచారం చేసేవారికి లౌకికవాద ప్రభుత్వం గౌరవ వేతనాలు ఇవ్వవలసిన అవసరం ఏమిటి?
పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడానికి నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో 8427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేలు చొప్పున గౌరవ వేతనం అందజేస్తారు. అది కూడా 2024 మే నెల నుంచి మొదలుపెట్టి ఇస్తారు. ప్రస్తుతానికి ఏడు నెలల వరకూ అంటే 2024 నవంబర్ వరకూ ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఇంకో విడతలో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇస్తారన్న మాటే. ఈ ప్రక్రియ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్ళూ కొనసాగుతుంది. ఏడాదికి ఒకో పాస్టర్కూ రూ.60వేల చొప్పున ఐదేళ్ళలో రూ.3లక్షలు గౌరవ వేతనంగా సమర్పిస్తారు. ప్రస్తుతానికి అర్హులుగా గుర్తించిన 8427 మందికి ఒక్కొక్కరికీ మూడు లక్షల చొప్పున ఈ ఐదేళ్ళ పదవీ కాలం ముగిసేసరికి రూ.252. 81కోట్లు చెల్లిస్తారన్న మాట. అర్హత కలిగిన పాస్టర్ల సంఖ్య, ఇచ్చే గౌరవ వేతనం మొత్తమూ భవిష్యత్తులో పెరగవన్న గ్యారంటీ ఏమీ లేదు. దాన్నిబట్టి ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది.
కథ ఇక్కడితో ఆగదు. ముస్లిముల మతగురువులకు కూడా అదే మొత్తంలో గౌరవ వేతనాలు చెల్లిస్తారు. మౌల్వీలు, ముతవల్లీలకు వారివారి స్థాయులను బట్టి గౌరవ వేతనాలు నిర్ణయిస్తారు. దాన్ని బట్టి గౌరవ వేతనాల పేరిట చేసే చెల్లింపులు ఇంకా పెరుగుతాయి.
క్రైస్తవ పాస్టర్లకు, భవిష్యత్తులో ముస్లిం మౌల్వీలు, ముతవల్లీలకు గౌరవ వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? ప్రభుత్వ ఖజానా నుంచే, అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఇస్తారు. నిజానికి అది లౌకిక రాజ్యం అనే భావనకే విరుద్ధం. ప్రభుత్వం అన్ని మతాలనూ సమదూరంలో పెట్టాలన్నది కదా లౌకిక రాజ్యం భావన. అలాంటిది, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు, ఇతరత్రా మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి కొన్ని మతాలకు చెందిన మత గురువులకు డబ్బులు ఎలా చెల్లిస్తారు?
సామాన్యంగా ఇక్కడ చేసే వాదన ఏంటంటే హిందూ దేవాలయాల్లో అర్చకులకు ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తున్నాయి. ఏకంగా దేవదాయ, ధర్మదాయ శాఖ పేరుతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. అలాంటప్పుడు చర్చిలు, మసీదుల్లో మతగురువులకు గౌరవ వేతనాలు ఎందుకు ఇవ్వకూడదు? నిజానికి దేవాలయాల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం మీద ఎవరూ పెట్టలేదు. ప్రభుత్వమే బలవంతంగా ఆ బాధ్యతలను తన మీద వేసుకుంది. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పని చేసింది. హిందూ దేవాలయాలను నిర్మించే సమయంలో పూర్వకాలంలో రాజులు, జమీందార్లు అనంతర కాలంలో వదాన్యులైన దాతలూ ఆ దేవాలయాల నిర్వహణకు సరిపడా వ్యవస్థను ఏర్పాటు చేసేవారు. దేవాలయాలు, వాటిలో అర్చకులు, ఆలయ విధులకు సంబంధించిన ఇతర కులవృత్తుల వారికి సరిపడా మాన్యాలు ఉండేవి. రకరకాల కారణాలు చెప్పి వాటిలోకి ప్రభుత్వాలు చొరబడ్డాయి. చివరికి, ఆదాయం ఉండే దేవాలయాలను మాత్రం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆదాయం లేని గుడులను గాలికి వదిలేసిన ప్రభుత్వాలు, ఆదాయం అధికంగా వచ్చే గుడుల్లో రకరకాల పేర్లతో టికెట్లు పెట్టి, భక్తుల జేబులు కొల్లగొడుతూ ఆ డబ్బులను దుర్వినియోగం చేస్తూ, భక్తుల విశ్వాసాల మీద ఆడుకోవడం సర్వసాధారణమైన ప్రక్రియగా మారిపోయింది. ఇప్పుడు ఏ ప్రముఖ దేవాలయంలో అయినా సామాన్య భక్తుడికి కనీసం దర్శనమైనా సరిగ్గా జరిగే వీలు లేదు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుక్కుంటే కానీ స్వామిని కొన్ని సెకన్ల పాటు చూసుకునే అవకాశం లేదు. అలా భక్తుడికి భగవంతుణ్ణి దూరం చేసాయి. పరోక్షంగా మత మార్పిడులకు ఇది కూడా పెద్ద కారణమే అయింది.
కథ అక్కడితో అయిపోలేదు. భక్తులు తమకు నచ్చిన దేవాలయాల్లో తమకు నచ్చిన దైవాలకు కానుకలుగా ఇచ్చుకునే సొమ్ములు ఆలయం అభివృద్ధి కోసమో, ధార్మిక కార్యక్రమాల కోసమో వెచ్చించాలని భావిస్తారు. కానీ దేవదాయ శాఖ పేరుతో ఆ సొమ్ములను ప్రభుత్వోద్యోగులకు ఖర్చు పెట్టేదే ఎక్కువగా ఉంటోంది. ధూప దీప నైవేద్యాలకు దిక్కు లేకుండా పోయిన గుడులు రాష్ట్రంలో వేలల్లో ఉన్నాయి. వాటి మాన్యాలు, ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. అయినా, పెద్ద దేవాలయాలకు వస్తున్న ఆదాయం రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉందంటే దానికి హిందువుల భక్తిభావమే కారణం. గుడుల నిర్వహణ పేరుతో ప్రభుత్వాలు చేసే పైత్యాల సంగతి సామాన్య పౌరులకు పెద్దగా తెలియదు. ఆ నిధులను ప్రభుత్వాలు తమ రాజకీయ, ఓటుబ్యాంకు అవసరాల కోసం విచ్చలవిడిగా వాడేసుకుంటుండడమే ఇన్నాళ్ళుగా జరుగుతూ వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మాట వాస్తవమే. అయితే కూటమిలో బీజేపీది నామమాత్రపు పాత్రే. హిందువుల గురించిన పలు అంశాలను కేవలం ప్రస్తావించడానికి అయినా తగినంత బలం లేని స్థాయిలో ఉంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడి పాత్ర ధరించాడు కానీ అది రాజకీయ వేషం మాత్రమే అన్న సంగతి సుస్పష్టం. నేరుగా బీజేపీలోనే ఉంటే మతతత్వ ముద్ర పడుతుందనే భావనతో సొంత జెండా, అజెండా సెట్ చేసుకున్నాడాయన. ఇంక ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి సంగతి ఎవరికి తెలియనిడి? అందువల్ల హిందూ భక్తుల పక్షాన సాధికారంగా మాట్లాడే పార్టీ ఏదీ రాష్ట్రంలో లేదు.
అందుకే క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నా అడ్డుకునే మాట సంగతి తర్వాత, కనీసం అడిగే నాథుడే లేడు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నిర్వహణ పేరిట ఆస్తులను కరిగించేసిన ఘనత గత తెలుగుదేశం హయాంలో జరిగింది. అదే సమయంలో ప్రభుత్వానికి పైసా ఆదాయం ఇవ్వని చర్చిలు, మసీదుల అభివృద్ధికి నిధుల కొరత మాత్రం ఎప్పుడూ ఉండదు. పాస్టర్లకు, మౌల్వీలకూ గౌరవ వేతనాలు ఇవ్వడానికి ఏ సమస్యలూ ఉండవు. వక్ఫ్ పేరిట ముస్లిం ధార్మిక సంస్థలకు బోలెడన్ని ఆస్తులున్నాయి. వాటి నుంచి పైసా ఆదాయం ప్రభుత్వానికి రాదు. చర్చిల పరిస్థితి ఇంకా గొప్ప. ఇంటి మీద సిలువ పెడితే అదే చర్చి, ఆ ఇంటి యజమానే పాస్టర్. నిజానికి చర్చిల ఏర్పాటుకు చాలా నిబంధనలు ఉన్నాయన్న సంగతి ప్రభుత్వానికే గుర్తుండి ఉండదు. అలాంటి పాస్టర్లు దశమ భాగాల పేరిట తమ చర్చి భక్తుల నుంచి వసూలు చేసే డబ్బులు, నిత్యావసర వస్తువులకు పరిమితి ఏమీ లేదు. అలా, నాలుగు రేకుల షెడ్డుతో మొదలుపెట్టి నాలుగేళ్ళు తిరక్కుండానే నాలుగంతస్తుల భవనాలు, నాలుగు చక్రాల వాహనాలూ సంపాదించుకున్న పాస్టర్లు రాష్ట్రంలో వేలమంది ఉన్నారు. అలాంటి పాస్టర్లకు ప్రభుత్వం అసలు గౌరవ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
క్రైస్తవ, ముస్లిం ఓటుబ్యాంకు కోసం రాజకీయాలు చేయడం పక్కన పెట్టి, నిజమైన ప్రజా ప్రభుత్వంగా పనిచేయాలని భావిస్తే పాస్టర్లకు, ఆ తర్వాత మౌల్వీలు-ముల్లాలు-ముతవల్లీలకు గౌరవ వేతనాలు ఇవ్వాల్సిన పని లేదు. రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ అలా చేయగల లౌకికవాదాన్ని అనుసరించగల దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?