మద్యం అమ్మకాల్లో తన ప్రమేయం లేదని, అంతా రాజ్ కసిరెడ్డి చూసుకున్నారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సెట్ విచారణలో చెప్పారు. మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి చోటుకుందనే విషయంలో నమోదైన కేసును సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని రెండో సారి సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తండ్రిని ఇవాళ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తరవాత, మద్యం అమ్మకాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు.
మద్యం అమ్మకాలు మొత్తం రాజ్ కసిరెడ్డి చూసుకున్నాడని, అతను పెద్ద క్రిమినల్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మద్యం వ్యాపారం కోసం అప్పు ఇప్పించాలని కోరగా, అరబిందో ఫార్మా యాజమాన్యం నుంచి వంద కోట్లు ఇప్పించినట్లు చెప్పారు. పార్టీలో రాజ్ కసిరెడ్డి అతిముఖ్యమైన పదవులు అప్పగించానని చెప్పారు. తనను రాజ్ కసిరెడ్డి భారీగా మోసం చేశాడని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
రాజ్ కసిరెడ్డికి వంద కోట్లు అప్పుగా ఇవ్వాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అని సిట్ అధికారులు ప్రశ్నించగా, అలాంటిది ఏం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరైనా ఉన్నారా అని సిట్ అధికారులు ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.
రాజ్ కసిరెడ్డి వల్ల ప్రజలు నష్టపోయారని, వైసీపీ నష్టపోయిందని విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు రాజ్ కసిరెడ్డి 2018లో పరిచయం అయ్యాడని గుర్తుచేశారు. వైసీపీ అందరినీ రాజ్ కసిరెడ్డి మోసం చేశాడని విజయసాయిరెడ్డి వాపోయారు.
2014 నుంచి 2019 వరకు వైసీపీలో కీలకంగా పనిచేసినట్లు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలకే నెంబరు టు అనేది మిథ్య అనేది గ్రహించినట్లు తనకు అర్థమైందన్నారు. మా నాయకుడికి చెప్పి చెప్పి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, వేలకోట్లు దోచేశాడు..అంటూ జగన్మోహన్రెడ్డికి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎన్నో అవమానాల పాలయ్యానని విజయసాయిరెడ్డి వాపోయారు. జగన్మోహన్రెడ్డి మనసులో తనకు స్థానం లేదని గ్రహించి వైసీపీకి రాజీనామా చేసినట్లు విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.