హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే విచారణ జరిపించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేసారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇప్పుడు చర్చ జరుగుతున్న తరుణంలో కేటీఆర్ ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ మేరకు ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేసారు.
కేటీఆర్ తన ట్వీట్లో ‘‘కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు నడపడం లేదని నిరూపించుకోవాలి. ప్రధానమంత్రి ఆ వ్యవహారంపై మాటలకు పరిమితం కారాదు. ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం వందల యెకరాల పర్యావరణ విధ్వంసానికి చెందిన వ్యవహారం మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న పదివేల కోట్ల రూపాయల ఆర్థిక మోసం. ఆ విషయమై దర్యాప్తు సంస్థలకు ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేసాం. ఆర్థిక అవకతవకలు ఉన్నాయని కేంద్రానికి చెందిన ఎంపవర్డ్ కమిటీ నిర్ధారించింది. స్వతంత్ర విచారణ జరిపించాలని సూచించింది. దానిపై కేంద్రం వెంటనే విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేసారు.