బెంగాల్‌లోని పరిస్థితుల గురించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో పరిస్థితులను గురించి మాట్లాడడానికి బదులు బంగ్లాదేశ్ అధికారులు తమ దేశంలో మైనారిటీల హక్కులను కాపాడడంపై దృష్టి సారించాలని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.
పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితుల గురించి ఇటీవల బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రెటరీ షఫీకుల్ ఆలం మాట్లాడారు. భారత్‌లో మైనారిటీలను రక్షించడానికి కేంద్రంతో పాటు బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు.
‘‘పశ్చిమ బెంగాల్లో సంఘటనల మీద బంగ్లాదేశ్ అధికారుల వ్యాఖ్యలు అర్ధరహితం. బంగ్లాదేశ్ అధికారుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్ధరహితమైనవి. భారత్‌పై నిందలు వేయడం బంగ్లాదేశ్ మానుకోవాలి. ఆ దేశంలో మైనారిటీల మీద జరుగుతున్న హింస గురించి భారత్ ఆందోళన చెందుతోంది. అలాంటిది, మా దేశం మీద బంగ్లాదేశ్ నిందలు వేయడం మానుకోవాలి. భారతదేశపు వ్యవహారాల మీద మాట్లాడడానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడడం గురించి ఆలోచిస్తే మంచిది’’ అంటూ బంగ్లాదేశ్‌కు దీటైన జవాబిచ్చారు.