ఢిల్లీ పాలనకు తలొగ్గి పనిచేయాల్సిన అవసరం తమకు లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తరవాత తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. తమిళనాడు పార్టీలను చీల్చడం సాధ్యం కాదన్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని తమిళనాడుపై రుద్దకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆపగలరా అని ప్రశ్నించారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వగలరా అంటూ విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుకుండా అమిత్ షా హామీ ఇస్తారా అంటూ స్టాలిన్ ప్రశ్నించారు.
ఎవరికి ఎవరూ సబార్డినేట్ కాదని ఇదే విషయాన్ని రాజ్యాంగం స్పష్టం చేసిందని స్టాలిన్ గుర్తుచేశారు. తమిళనాడులో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు తరవాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందంటూ చేస్తున్న ప్రచారాన్ని స్టాలిన్ తిప్పికొట్టారు.
రాష్ట్రాల స్వయం సాధికారతపై అధ్యయనం చేసేందుకు ఇటీవల సీఎం స్టాలిన్ ఓ కమిటీని వేశారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కమిటీ నివేదిక వచ్చిన తరవాత తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.